Telangana MLC Elections: తెలంగాణలో కాంగ్రెస్- సీపీఐ పార్టీల మధ్య పొత్తు కంటిన్యూ అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న రెండు పార్టీలు.. ఎన్నికల బరిలో నిలిచాయి. అయితే పొత్తులో భాగంగా కొత్తగూడెంతో పాటు మునుగోడు సీటును సీపీఐ పార్టీకి అప్పట్లో కేటాయించారు. వీటితో పాటు.. ఓ ఎమ్మెల్సీ సీటు కూడా ఇస్తామని అంగీకారం చేసుకున్నారు. కానీ అప్పటివరకు బీజేపీలో కొనసాగిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. మునుగోడును సీపీఐ త్యాగం చేయాల్సి వచ్చింది.
కానీ మునుగోడును వదిలేసినందుకు మరో ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. అందరూ ఊహించినట్టుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో ఎమ్మెల్సీ సీట్ల పంపకాలపై సీఎంను కలిసిన సీపీఐ నేతలు పలుమార్లు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేద్దామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల వెనుక స్మితా సబర్వాల్.. ఆమె ఏం చేశారో తెలుసా?
ఇక రాష్ట్రంలో త్వరలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో రెండు సీట్లు కావాలని సీపీఐ పట్టుబడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లు కేటాయించి కేవలం ఒక్కసీటు మాత్రమే ఇచ్చారు. కనీసం పెద్దల సభకైనా ఇద్దరు నేతలను పంపించాలని కోరుతున్నట్టు సమాచారం. కానీ రెండు సీట్లు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దంగా లేనట్టు తెలిసింది. ఒక్క సీటు అయితే ఇవ్వగలుగుతాం కానీ.. రెండేసీ సీట్లు ఇవ్వడం అసాధ్యమని తేల్చి చెప్పారట. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనూ ఆశావాహులు ఎక్కువగా ఉన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఖంగుతున్న సీపీఐ పెద్దలు ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారట. అక్కడే పార్టీ పెద్దలతో తాడోపేడో తేల్చు కుంటామని అంటున్నట్టు తెలుస్తోంది.
Also Read: SLBC Tunnel Accident: రంగంలో దిగిన ర్యాట్ హోల్ మైనర్లు, 8 మందిని కాపాడగలరా, అసలు బతికే ఉన్నారా
ఇదిలా ఉంటే.. వచ్చేనెలలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్ నేతలు ఇప్పటినుంచే కుస్తీ పడుతున్నారు. మార్చి నెలలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుంది. ఈ సీట్లలో నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కనుండగా.. ఒకసీటు మాత్రం ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు దక్కనుంది. అయితే నాలుగు సీట్లపై పోటీ చేసే విషయంలో మాత్రం కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్టు సమాచారం. ఇందులో ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు చెందిన నేతలు ఇప్పటికే లాబీయింగ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. పలువురు నేతలైతే ఇప్పటికే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారట.
ఈ అంశాలన్నీ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి ఒకసీటు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో మాత్రం న్యాయం చేస్తామని చెప్పారట. కానీ ఈ విషయంలో సీపీఐ నేతలు మాత్రం ససేమీరా అంటున్నట్టు తెలిసింది. మరో ఎమ్మెల్సీ సీటు కోసం మరో రెండేళ్లు ఆగాల్సిన అవసరం తమకు లేదని అంటున్నారట.
మొత్తంమీద రెండు పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో.. కాంగ్రెస్ పెద్దలు కూడా వేచిచూసే ధోరణిలో ఉన్నారట. కానీ సీపీఐ మాత్రం ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యిందంటున్నారు. ఒకవేళ రాష్ట్రంలో ఈ పంచాయితీ తెగని పక్షంలో ఢిల్లీ పెద్దలను ఓసారి కలిసి ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల పంపకాలు మాత్రం అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









