Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తోంది. రాష్ట్రంలో హస్తం పార్టీ పవర్ లోకి రాగానే అప్పటివరకు బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగిన కీలక నేతలు.. అధికారం, పదవుల కోసం వెంటవెంటనే పార్టీ మారారు. ఇందులో పదిమంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారు. అప్పట్లో వీరికి పదవుల ఆశచూపే కాంగ్రెస్ పార్టీ చేర్చుకుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఏడాదికాలంగా పార్టీ మారిన నేతలెవ్వరికీ పదవులు దక్కలేదు.. అటు పార్టీని పవర్‌లోకి తెచ్చేందుకు కృషి చేసిన మరికొందరు నేతలకు కూడా పదవులు రాలేదు. దాంతో కొందరు నేతలు పదవుల కోసం ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంచార్జ్ పార్టీ మారిన నేతలకు పదవుల విషయంలో ఓ క్లారిటీ ఇచ్చారు.
Also Read: Cabinet Expansion: 'బుగ్గకారు' ఎక్కేందుకు బ్లాక్‌మెయిల్.. రేవంత్ రెడ్డి పరేషాన్
తెలంగాణ కాంగ్రెస్‌కు మొన్నటివరకు దీపాదాస్ మున్షీ ఇంచార్జ్‌గా పనిచేశారు. ఆమె దాదాపు ఏడాదికి పైగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా సేవలందించారు. ఈ ఏడాది సమయంలో దీపాదాస్‌పై అనేక అవినీతి ఆరోపణలు వెలువడ్డాయి. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ లీడర్లను పక్కన పెట్టేశారని.. కొత్తగా వలస వచ్చిన నేతలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సొంత పార్టీ లీడర్లే బహిరంగంగా విమర్శలకు దిగారు. అప్పట్లో నేతల వరుస ప్రకటనలు అధికార పార్టీకి ఉక్కిరిబిక్కరి చేశాయి. ఈ క్రమంలోనే కొందరు నేతలు దీపాదాస్ వ్యవహార తీరుపై పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దాంతో ఆమెను తప్పించి.. కొత్త ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆమె వచ్చిరాగానే.. కాంగ్రెస్ నేతలకు బిగ్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేశారు.
Also Read: New Posts For Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. రెవెన్యూ శాఖలో నూతన అధ్యాయం
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ మీనాక్షి నటరాజన్ చుట్టే తిరుగుతున్నాయి. ఆమె సింప్లిసింటీని చూసిన కాంగ్రెస్ నేతలు.. ఆమెను డీల్ చేయడం చాలా కష్టమని ఓ భావనకు వచ్చారని అంటున్నారు. అంతేకాదు మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి రాగానే మొదటిసారి పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇన్నాళ్లు కష్టపడి పనిచేసినవారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని, అలాంటివారికే పదవులు ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్యారాచూట్ నేతలు, ఫిరాయింపుదారులకు పదవులు ఇవ్వడం అసాధ్యమని తేల్చేశారు. ఈ మాటలు విన్నాక బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెసు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి.. పోస్టులు కొట్టేద్దామని భావించిన తమ ఆశలపై కొత్త ఇంచార్జ్ నీళ్లు చల్లారని అనుచరుల దగ్గర వాపోతున్నట్టు తెలిసింది.
ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో చాలా మంది లీడర్లు పదవు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి లీడర్లు పదవులు ఆశిస్తున్నారు. వీళ్లు ఏకంగా మంత్రి పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇతర పోస్టులు ఆశిస్తున్నారు. కానీ పదవుల పంపకాలపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఇందులో కొందరిని అనర్హత వేటు టెన్షన్ పెడుతోంది. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వస్తే.. తమ పరిస్థితి ఏంటని దిగుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ బాంబు పేల్చడంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలిసింది. మొత్తంగా పార్టీ మారిన నేతలకు కొత్త ఇంచార్జ్ దిమ్మతిరిగే షాక్ ఇవ్వడంతో.. వీరి పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని చర్చ జరుగుతోంది. అయితే వీరిలో కొందరు లీడర్లు మాత్రం.. తిరిగి సొంత గూటికి వెళ్లే ఆలోచన సైతం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









