Telangana Politics: మూడు పార్టీల మధ్య డైలాగ్ వార్‌.. ప్రజలు పరేషాన్

Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్‌ మొత్తం హెచ్‌సీయూ ల్యాండ్ చుట్టే తిరుగుతున్నాయి..! 400 ఎకరాల భూముల విషయంలో మూడు పార్టీల మధ్య డైలాగ్ వార్‌ నడుస్తోంది..! ఈ కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరినా నేతల మధ్య మాటల తూటాలు మాత్రం ఆగడం లేదు..! ఈ డైలాగ్ వార్‌తో తెలంగాణ ప్రజలు పరేషాన్‌ అవుతున్నారా..!   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 11, 2025, 10:01 PM IST
Telangana Politics: మూడు పార్టీల మధ్య డైలాగ్ వార్‌.. ప్రజలు పరేషాన్

Telangana Politics: తెలంగాణలో హెచ్‌సీయూ భూముల వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌విమర్శలు గుప్పిస్తోంది. భూముల అమ్మకాలతో ప్రభుత్వం వేల కోట్ల స్కామ్‌కు పాల్పడుతోందని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. అయితే ఈ భూములు యూనివర్సిటీకి సంబంధించినవి కాదని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మాత్రం ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటునే ఉంది. ప్రభుత్వాన్ని అన్నిరకాలుగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో భూములు స్వాధీనానికి బ్రేక్ పడింది. అయినా బీఆర్‌ఎస్‌ మాత్రం తగ్గేదేలేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది..
 
ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వెనుక 10వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని విమర్శించారు. అటవీ చట్టాలను రేవంత్ ప్రభుత్వం ఉల్లంఘించి.. అర్థరాత్రి దొంగల్లా పచ్చని చెట్లను కూల్చారని మండిపడ్డారు. ట్రస్ట్ ఇన్వెస్టర్స్ అడ్వైజర్స్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని, ఈ ఒప్పందంలో ఓ బీజేపీ ఎంపీ మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపించారు. ఏ ప్రాతిపదికన ఈ కేటాయింపులు చేశారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటేనే సీవీసీ, సీబీఐ విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 
 
అటు హెచ్‌సీయూ భూములపై బీఆర్ఎస్‌ చేస్తున్న రాద్ధాంతంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. హైదరాబాద్‌లో బంగారం లాంటి భూములను గతంలోనే బీఆర్ఎస్ నాయకులు అమ్ముకున్న విషయం మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ఆ భూములను సొంత నేతలకే అమ్ముకున్నారని ఆరోపించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కొండలను కూడా కరిగించి పనులు జరుగుతున్నాయని, ఆ భూములను అమ్మింది ఎవరు అని నిలదీశారు. గత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లోనే 10 వేలకుపై చిలుకు భూములను అడ్డగోలుగా అమ్ముకున్నారని ఆరోపించారు. గతంలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పోరాటం చేయడంతో ఆ భూములు ప్రభుత్వానికి దక్కాయని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన కేసీఆర్.. హెచ్‌సీయూ భూములతో పాటు పలు యూనివర్సీటీలకు చెందిన భూములను కూడా దోచుకోవాలని చూశారని విమర్శించారు. ఐఎంజీ భరత్ సంస్థతో 33 శాతం ముడుపులు తీసుకునేలా అప్పటి మంత్రి కేటీఆర్ ఒప్పందం సైతం చేసుకున్నారని మండిపడ్డారు. నిజానికి కేటీఆర్‌కు రావాల్సిన ముడుపులు 5 వేల 200 కోట్ల రూపాయాలను కాంగ్రెస్‌కు అంటగడ్డే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పదేళ్ల భూ దోపిడీపై దమ్ముంటే చర్చకు రావాలంటూ కేటీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. 

Add Zee News as a Preferred Source

మరోవైపు కేటీఆర్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కంచ గచ్చిబౌలి భూముల చీకటి కోణాన్ని 48 గంటల్లో బయట పెడుతానని చెప్పి ఎక్కడికెళ్లావంటూ ప్రశ్నించారు. ఇటీవల హైడ్రోజన్ బాంబు వేస్తానన్న కేటీఆర్.. ఎంత పెద్ద చప్పుడు అవుతుందో.. ఎన్ని ప్రణాలు కోల్పోతాయో, దేశం అల్లకల్లోలం అయిపోతుందని అనుకున్నాం.. చివరికి ఉల్లిగడ్డ బాంబ్ కూడా వేయకుండా వెళ్లిపోయావ్.. అని చామల సెటైర్లు వేశారు.
 
ఇక కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలకు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు ఎంపీ ధర్మపురి అరవింద్‌. రాష్టంలో అవినీతి, అసమానతల ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు ఎంపీ ధర్మపురి అరవింద్‌. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో రాష్ట్రం అప్పుల పాలైందని అందరి కంటే ఎక్కువ విమర్శించింది రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఇప్పుడు 400 ఎకరాల స్థలం భూములను సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయిస్తే కేసు క్లోజ్‌అవుతుందన్నారు. అలాగే బీఆర్‌ఎస్‌ నేతలకు హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. గతంలో రాష్ట్రంలో పాలనవ్యవస్థను ఆగం చేసిందే కేటీఆర్‌ అని ఆరోపించారు.. 
 
మొత్తంమీద నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో తెలంగాణ పాలిటిక్స్‌హీటెక్కుతున్నాయి. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ.. నేతలు మాత్రం మాటలు తూటాలు పేలుస్తునే ఉన్నారు. అయితే నేతల మధ్య డైలాగ్‌వార్‌ చూస్తుంటే మాత్రం.. ఈ అంశం ఇంకా ఎక్కడివరకు వెళ్తుందోనని ప్రజలు టెన్షన్ పడుతున్నారు. 

Also Read: Jewellery Stock: ప్రతి నెలా 200 కిలోల బంగారం .. 3ఏళ్లలో 3365% రాబడి.. అప్పర్ సర్క్యూట్ కొట్టిన స్టాక్ ఇదే!  

Also Read: Twice Allowance: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఇకపై ఏడాదికి రెండుసార్లు అలవెన్స్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News