)
Telangana Local Body Elections Break: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలిస్తూ తెలంగాణ సర్కార్ ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. రెండు రోజుల పాటు జరిగిన వాదనల తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషనర్లు తర్వాత రెండు వారాల్లో రిప్లైలు దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. రిజర్వేషన్ల జీవో పై స్టే ఇచ్చినందున ఆటోమేటిక్ గా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా చెల్లదు. తీర్పు కాపీ ఎస్ఈసీకి అందిన తర్వాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారు. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు అధికార పార్టీకి ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం .. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను జారీ చేసింది. అయితే ఇచ్చిన జీవో వ్యాలిడ్ అవుతుందా లేదా అన్నది పట్టించుకోకుండా జీవో ఇచ్చేసిందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు జీవో ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ రాజ్యాంగపరంగా అమోదం పొందని బిల్లును చూపించి జీవో ఇవ్వడంతో ఆ జీవో చెల్లదన్న నిర్ణయానికి న్యాయవర్గాలే కాదు.. రాజకీయవర్గాలు కూడా వచ్చాయి. ఇప్పటికే మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లాంటి నేతలు బహిరంగంగానే ప్రకటించారు. కానీ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే తొలిరోజు చాలామంది అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు రిజర్వేషన్ల జీవో పై స్టే ఇవ్వడంతో.. నోటిఫికేషన్ ను మార్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
అయితే హైకోర్టులో బీసీ రిజర్వేషన్లు ఆగిపోవడానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలే కారణమంటూ కాంగ్రెస్ నేతలు అరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా రెండు పార్టీలు కుట్ర చేశాయంటూ మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై కోర్టుల్లో కేసులు వేసిందని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కులగణన చేసిన లెక్కలతోనే రిజర్వేషన్లు ఖరారు చేశామన్నారు. సీఎంతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు మంత్రి జూపల్లి.
మరోవైపు ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42శాతం బీసీ రిజర్వేషన్ల డ్రామాగా పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే జాతీయ నాయకులతో డిల్లీ వేదికగా కోట్లాట పెడితే... కలిసి రావడానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. హైకోర్టు తీర్పుపై ఎక్స్ వేదికగా హరీశ్ రావు స్పందించారు. అటు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి, తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపి. మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడండి. పార్లమెంట్లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చేలా చూడాలని సూచించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలని, ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించాలన్నారు. మరోవైపు జీవో వల్ల రిజర్వేషన్లు రావని తెలిసే.. జీవో ఇచ్చారని మండిపడ్డారు మాజీమంత్రి గంగుల కమలాకర్. న్యాయపరమైన చిక్కులు తొలిగిపోయాకే.. ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు బ్రేక్ వేయడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అని విమర్శించారు. బీసీలను సీఎం రేవంత్ రెడ్డి నిలువునా మోసం చేశారని అన్నారు. పరిపాలన చేతగాక డ్రామాలు ఆడటం అలవాటు అయిపోయిందని ఎద్దేవా చేశారు. కేవలం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకు తెచ్చారని అన్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఎలా నిలబడతాయని ప్రశ్నించారు. బీసీలపై రెడ్డికి చిత్తశుద్ధి లేదని అందుకే ఈ డ్రామా అని విమర్శించారు.
మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవనే చర్చ జరుగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్లేషన్ల వ్యవహారం ఇప్పట్లో దొరికే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం నుంచి చట్టబద్దత వస్తే గానీ బీసీలకు రిజర్వేషన్ల దక్కే పరిస్థితి కనిపించడం లేదు.. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. లోకల్ పోల్స్ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యాయి. పార్టీ నేతలు కూడా పదవుల కోసం చూస్తున్నారు. కానీ బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తామని చేసిన ప్రకటనల వల్ల రేవంత్ ఇప్పుడు ఇదంతా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కోర్టు ఆపేసింది కనుక.. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో ప్రకారమే .. స్థానిక ఎన్నికలకు రీ షెడ్యూల్ జారీ చేసి.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే సరైన వ్యూహం పాటించినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ కూడా ఈ ప్రణాళికకు ఎప్పుడో సన్నాహాలు చేసుకున్నారనే ప్రచారం సైతం జరుగుతోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.