Heat Waves in Telangana: తెలంగాణలో సూర్యుడు సుర్రమనిపిస్తున్నాడు. బయట అడుగుపెడితే చాలు మాడు పగలగొడుతున్నాడు. తెలంగాణలో రాగల మూడు రోజుల వరకు పొడి వాతావరణం మూలానా.. ఎండలు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య మహారాష్ట్రలో పాటు మధ్య కర్ణాటక నుంచి ఉత్తర కేరళ వరకు సగటు సముద్ర మట్టం 900 మీటర్లు ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీన పడటంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు జనాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. గురువారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 41.9 డిగ్రీలు నమోదు కాగా నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సైతం 41 నుంచి 42 డిగ్రీల దాకా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి.
మార్చి నెల చివరి రోజుల్లో పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో వాతావరణం ఏ స్థాయిలో ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ ఎండలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలో ఆందోళనకరంగా మారుతున్నాయి. బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, శ్రీరామ్ పూర్, ఆసిఫాబాద్, తాండూర్, గోలేటి, తిర్యాని, కాజీపేట ప్రాంతాల్లో విపరీతమైన వేడి పెరిగింది. సిర్పూర్ పేపర్ మిల్ విస్తరించి ఉన్న కాగజ్ నగర్ టౌన్ సహా పరిసర ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత విపరీతంగా పెరగడం తో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఎండ తీవ్రతను తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు రాజధాని హైదరాబాద్ నగరంలో ఎండలు మండుతున్నాయి. రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరడంతో నగరవాసులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో నగరవాసులు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం నగరంలోని కాప్రా, నాచారం, ఎల్‌బీనగర్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, బేగంపేట ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు, గాజులరామారం,చాంద్రాయణ గుట్ట, చార్మినార్, రాజేంద్రనగర్‌లలో అత్యధికంగా 40 డిగ్రీలుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశముందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









