ప్రముఖ టీఆర్ఎస్ నేత, గతంలో నార్‌మ్యాక్స్ సంచాలకులుగా పనిచేసిన పీరంగి నారాయణరెడ్డిపై పలువురు విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేయడంతో ఆయన అక్కడిక్కడే మరణించారు. వివరాల్లోకి వెళితే.. గతకొంత కాలంగా నారాయణరెడ్డికి, ఆయన ప్రత్యర్థులకు మధ్య తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్ పూర్ ప్రాంతంలో నారాయణరెడ్డిపై పలువురు దుండగులు దాడి చేశారు. కర్రలతో, రాళ్లతో ఆయనను కొట్టడంతో ఆయన ప్రతిఘటించడానికి కూడా సమయం చిక్కలేదని పలువురు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దుండగులు అక్కడి నుండి వెళ్లిపోయాక... స్థానికులు నారాయణరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. కాగా.. డాక్టర్లు ఆయన మరణించారని నిర్థారించారు. నారాయణరెడ్డి మరణించిన క్రమంలో ప్రస్తుతం వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే సంఘటన జరిగిన స్థలానికి చేరుకొని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను రప్పిస్తున్నారు. 


పీరంగి నారాయణరెడ్డి అనుచరులు కొందరు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీ పరమైన గొడవలు కూడా ఈ దుర్ఘటనకు దారి తీసి ఉండవచ్చిన పలువురు అంటున్నారు. నారాయణరెడ్డి మరణవార్త వినగానే ఆయన అనుచరులు పలువురు స్థానిక కాంగ్రెస్ నేతల ఇండ్ల పై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని.. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశామని వికారాబాద్ పోలీసులు తెలిపారు. నారాయణరెడ్డి మరణవార్త వినగానే పలువురు టీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు సంతాపాన్ని తెలియజేశారు.