)
TSRTC Bathukamma, Dusshera Offer: తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా. దసరాకు ముందు బతుకమ్మ ఉత్సవాలను భారీ స్థాయిలో జరుపుకుంటారు. పెద్ద పండుగకు తెలంగాణ ప్రజలందరూ స్వగ్రామాలకు తరలివెళ్తారు. పట్టణాల నుంచి పల్లె బాట పట్టనున్న తెలంగాణ ప్రజల కోసం రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) భారీ శుభవార్త ప్రకటించింది. బతుకమ్మ, దసరా పండుగకు ఏడున్నర వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పండుగకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
బతుకమ్మ, దసరా సందర్భంగా ప్రజలకు రవాణాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా 7,754 ప్రత్యేక బస్సులను నడపడానికి సిద్ధమైంది. వీటిలో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 30న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ ఉండడంతో ఈ నెల 27వ తేదీ నుంచే ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకుంటారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదిల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ తెలిపింది.
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపింది.
పండుగలకు రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బందులు పడొద్దని ఆర్టీసీ సూచించింది. ఆర్టీసీలో ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్లు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని తెలిపింది. ప్రయాణికులు పండుగ ఆనందాన్ని ఆర్టీసీతో పంచుకోవాలని ఎండీ సూచించారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ అవకాశం కూడా కల్పించింది. http://tgsrtcbus.in లో బస్సుల రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. దసరా ప్రత్యేక సర్వీసులకు సంబంధించి ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook