
Two Days Heavy Rains: తెలంగాణలో అకాల వర్షాలు వర్షాకాలంలో పడినట్టు పడుతున్నాయి. గురువారం హైదరాబాద్‌తోపాటు దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే తెలంగాణకు మరో ముప్పు పొంచి ఉంది. రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల మూడు రోజుల వరకు తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది.
మరాఠ్వాడ, దాని అనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. తూర్పు గాలులలో ద్రోణి గురువారం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనం మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి మీ ఎత్తులో ఏర్పడింది. ఉత్తరాంధ్ర తీరం, దానికి సమీప ప్రాంతాల్లో ఉపరితల చక్రవాక ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 0.9 కి మీ ఎత్తులో ఏర్పడింది. మధ్య చత్తీస్ఘడ్, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కి మీ ఎత్తులో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం గురువారం బలహీన పడింది. నైరుతి మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం కూడా బలహీనపడింది.
తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో చాలా చోట్ల వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. రేపు శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
వేసవి కావడంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండగా వర్షాల కారణంగా రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఈ వార్తతో తెలంగాణలో వాతావరణం సానుకూలంగా ఉండనుంది. అయితే మూడు రోజుల అనంతరం గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ములుగు, వరంగల్, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe