
Minister Vakiti Srihari: కాంగ్రెస్ మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్నారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.. ఆ వెంటనే ఖమ్మం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ప్రభుత్వం నియమించింది. దీంతో జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం కోసం ఆయన ఖమ్మం వచ్చారు. అప్పటికే ఆయన షెడ్యూల్ ను పౌర సంబంధాల శాఖ కూడా అఫీషియల్‌గా ఖరారు చేస్తూ సమయం కూడా కేటాయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్లతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలి. ఇందుకు ఇంచార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి పెద్ద కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఖమ్మం వచ్చారు. ముందుగా డిప్యూటీ సీఎం భట్టిని కలిసి.. తనకు మంత్రిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది..
అయితే సమీక్షకు సిద్దమవుతుండగా సడన్ గా వాకిటి శ్రీహారి ఖమ్మం నుంచి వెళ్లిపోయారు. ఎంత ఫాస్ట్‌గా హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చారో.. అంతే ఫాస్ట్‌గా ఖమ్మం నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. అయితే జిల్లా కలెక్టర్ అనుదీప్ మర్యాదపూర్వకంగా మంత్రిని కలవకపోవడంతోనే మంత్రి అలిగి వెళ్లిపోయారని మొదటగా ప్రచారం జరిగింది. అనంతరం కాసేపటికే మంత్రి శ్రీహారిని కలెక్టర్ కలిసి బోకే అందించిన ఫోటోలు బయటకు రావడంతో అసలు ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కలెక్టర్ పిలవకపోవడంతో మంత్రి వెళ్లిపోలేదట.. దానికి మరో కారణం ఉందన్న టాక్ వినిపిస్తోంది. కొన్ని మీడియా సంస్థలు అయితే కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకపోవడంతో మంత్రి అలిగి వెళ్లిపోయారని బ్రేకింగ్ లు కూడా ఇచ్చాయి. అంటే లోపాయికారికంగా ఏం జరిగిందో తెలియక అంతా అధికారులపై నెపం నెట్టారు.. కానీ సమీక్ష సమావేశానికి మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో ఇంచార్జ్ మంత్రి సమీక్షకు హాజరుకావడం సబబు కాదని డిప్యూటీ సీఎం భట్టి, కొత్తగా ఇంచార్జ్ బాధ్యతలు స్వీకరించిన మంత్రి శ్రీహరికి చెప్పారట. దీంతో ఖమ్మం వరకు వచ్చిన మంత్రి అర్ధంతరంగా హైదరాబాద్ వచ్చేసినట్టు సమాచారం. అయితే మంత్రి అలా వెళితే తమకు చెడ్డ పేరు వస్తుందని భావించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తనకు మంత్రి పదవి రావడానికి కృషి చేసిన డిప్యూటీ సీఎం భట్టిని కలవడానికి ఖమ్మం వచ్చి కృతజ్ఞతలు చెప్పినట్లు మంత్రి శ్రీహరితో చెప్పించే ప్రయత్నం చేశారట. అలా చెప్పిన మంత్రి అక్కడి నుంచి అటే హైదరాబాద్ వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహారికి కేబినెట్లో చోటు దక్కింది. బీసీ ముదిరాజ్ సామాజికవర్గంలో కోటాలో ఆయన మంత్రి పదవి దక్కింది. అయితే కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనకు ఖమ్మం ఇంచార్జ్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అప్పటివరకు ఖమ్మం ఇంచార్జ్ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ బాధ్యతలను తప్పుకున్నారు. అయితే గతంలోనే ఖమ్మం ఇంచార్జ్‌గా ఉన్న సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా నేతలతో ఒక్కసారి మాత్రమే సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆయన సమీక్ష జరపకపోవడం కూడా చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు ఇదే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు కీలకంగా ఉండటం కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పెద్దగా సమీక్షపై ఆసక్తి చూపలేదని అంటున్నారు..
మొత్తంమీద జిల్లాలో ఇంచార్జ్ మంత్రి హోదాలో తొలిసారి అడుగుపెట్టిన వాకిటి శ్రీహారికి అర్ధంతరంగా ఖమ్మం నుంచిపంపించి వేయడంతో అంత అవాక్కయ్యారు. బీసీ మంత్రిని ఈ తరహాలో అవమానించడం కరెక్ట్ కాదని పలువురు బీసీ సంఘాల నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే అంశంపై మంత్రిని సంప్రదించడానికి ప్రయత్నం చేస్తే అందుబాటులోకి రాలేదు.. ఏది ఎమైనా ఇంచార్జ్ మంత్రిగా జిల్లాకు వచ్చిన శ్రీహరికి ఈ తీరుగా స్వాగతం ఉంటుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు.. కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టారు కనుక కాంగ్రెస్ రాజకీయాలు ఇంకా అర్థం చేసుకోవాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook