)
Andhra Pradesh Politics: నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి అవినీతికి ఎక్కడా ఆస్కారం ఉండొద్దని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా.. కొందరు నెల్లూరు నేతలు సీఎం మాటలకు లెక్కచేయడం లేదని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి రేషన్ బియ్యాన్ని ఇష్టానుసారం విదేశాలకు తరలిస్తూ కొందరు నేతలు భారీగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు అధికార పార్టీ నేతల అక్రమాలను సొంత పార్టీ నేతలే బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే తమకు దాక్కాల్సిన వాటాలు దక్కకపోవడంతో కొందరు నేతలు వారిని టార్గెట్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు కొందరు నేతల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరో వైపు వైసీపీ నేతలతో అధికార పార్టీ నేతలు కుమ్మక్కు అయ్యారని తేలడంతో రాష్ట్ర చీఫ్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి మంత్రి నారాయణ పెద్దదిక్కులా ఉన్నారు. మంత్రి నారాయణ ముఖ్య అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పౌరసరఫరాలశాఖ స్టేట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. జిల్లాలోని కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి రేషన్ బియ్యం తరలింపు యథేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు. అటు కావలి, కందుకూరు, ఉదయగిరి, గూడూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, సర్వేపల్లి నుండి సేకరిస్తూ నెల్లూరు రూరల్ లో అల్లిపురంలో రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేస్తూ సన్న బియ్యంగా మారుస్తున్నారు. ఆ తర్వాత చెన్నై కేరళ కర్ణాటక రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. అంతేకాదు బియ్యం అక్రమ రవాణాలో వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వ్యవహరిస్తున్నారని ప్రెస్ మీట్లో ఆయన చెప్పకనే చెప్పారు.
కొద్ది రోజులుగా ఏపీలో అక్రమ బియ్యం రవాణాపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. అప్పట్లో కాకినాడలో పెద్ద ఎత్తున బియ్యం తరలిస్తున్న షిప్ ను సీజ్ చేయించారు. అయినా కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగలేదు.. ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఇందులో అధికార పార్టీలో కొందరు నేతల ప్రమేయం ఉందని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి కొరడా ఝులిపించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.. అయితే టీడీపీ నేతల అక్రమాలపై పవన్ ఎలా స్పందిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడు నెల్లూరు నేతల వ్యవహారం టీడీపికి తలనొప్పిగా మారింది. దాంతో నేరుగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డట్లు సమాచారం. అధికార పార్టీలో కొనసాగుతూ బహిరంగంగా విమర్శలు చేసుకోవడం పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తలంటినట్టు సమాచారం. మరో వైపు ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లే యోచనలో రాష్ట్ర చీఫ్ పల్లా ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే నెల్లూరు జిల్లాలో కొందరు నేతలపై త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయని అమరావతి వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల కొందరు మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అన్ని జిల్లాల ఇంచార్జ్ మంత్రులే ఎమ్మెల్యేలు, ఇతర నేతలను కంట్రోల్ చేయాలని ఆదేశించారు. ఇప్పుడు నెల్లూరు నేతల వ్యవహారంపై తప్పక చర్యలు ఉంటాయని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు..