)
Konda Surekha Vs MLAs: వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు చల్లారడం లేదు. కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఈ వర్గపోరు మరోసారి బయపడింది. వరంగల్‌లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో కొండా సురేఖ పాల్గొంటారని తెలుసుకున్న జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఆమె పాల్గొన్న కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. కానీ హన్మకొండలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న ప్రజా పాలన దినోత్సవంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. అయితే కొండా సురేఖ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన నాయకులు పొంగులేటి కార్యక్రమానికి హాజరయ్యారు. దాంతో జిల్లా నేతల మధ్య ఆధిపత్య పోరు ఏమాత్రం తగ్గలేదని చర్చ జరుగుతోంది.
కొద్దిరోజులుగా వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు సాగుతోంది. మంత్రి వర్సెస్ జిల్లా ఎమ్మెల్యేలుగా వర్గపోరు నడుస్తోంది. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి జిల్లా ఎమ్మెల్యేలపై వివాదస్పద కామెంట్స్ చేయడంతో మొదలైన లొల్లి ఇప్పటివరకు చల్లారలేదు.. ఇటీవల ఎమ్మెల్యేలు కడియం శ్రీహారి, రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. దాంతో కొండా మురళిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఆ తర్వాత జిల్లా నేతల పంచాయితీ క్రమశిక్షణ కమిటీ వద్దకు చేరింది. ఇటీవల మల్లురవి నేతలను పలిచి అభిప్రాయాలు తీసుకున్నారు. కానీ నిర్ణయం మాత్రం తీసుకోలేదు. దాంతో పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా భద్రకాళి ఆలయం పాలకమండలి పోస్టుల భర్తీ విషయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి మధ్య వివాదం రాజుకుంది. పాలకమండలి పదవులను మంత్రి అనుచరులకే ఇచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. అటు మంత్రి కూడా జిల్లా నేతలను కలుపుకుని వెళ్లడం లేదని ప్రచారం సాగుతోంది.
ఈ క్రమంలోనే ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని కలిసిన నాయకులు భద్రకాళి ఆలయం పాలకవర్గం విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. అంతేకాదు కొండా సురేఖతో హన్మకొండలో ప్రజాపాలన దినోత్సవాలు జరిపిస్తే తామంతా డుమ్మా కొడతామని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వరంగల్ జిల్లాను మినహాయించి హన్మకొండ బాధ్యతలు అప్పగించాలని కూడా పట్టుబట్టి సక్సెస్ అయినట్టు ప్రచారం సాగుతోంది. అందుకే హన్మకొండ ప్రజాపాలన ఉత్సవాల బాధ్యతలు పొంగులేటికి అప్పగించారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు హన్మకొండ జిల్లా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన కొండా సురేఖను తాను ప్రాతినిధ్యం వహించే తూర్పు నియోజకవర్గం వేదికగా నిర్వహించే కార్యక్రమాలు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే విషయాన్ని సీరియస్ గా తీసుకున్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన నియోజకవర్గంలో జరిగే అధికార ఉత్సవాలకు దూరం చేసినట్టు ప్రచారం సాగుతోంది.
మరోవైపు ఇదే జిల్లాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు సైలెంట్‌గా ఉండటం చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నియోజకవర్గానికే పరిమితమయ్యారు. జిల్లాకు రేవంత్ రెడ్డి వచ్చినా దొంతి మాత్రం బయటకు రావడం లేదు. మరోవైపు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మొదట్లో కొండా సురేఖ వెంట నడిచారు. కానీ ఇప్పుడు ఈమె కూడా మంత్రి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సీతక్క కూడా ఈ వివాదంలోకి పోకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం ఆమె నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారన్న చర్చ జరుగుతోంది. అయితే జిల్లాలో నేతలంతా ఎవరికి వారుగా విడిపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఇలా వర్గపోరుతో నేతలంతా కొట్టుకుంటుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి డ్యామేజీ ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ఓరుగల్లు పంచాయితీకి ఎండ్ కార్డ్ వేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook