'కరోనా వైరస్' లేదా కోవిడ్-19 ఈ పేరు వింటేనే చైనా సహా ప్రపంచ దేశాలు గజగజా వణికిపోతున్నాయి. ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 3 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు.  ఇంకా చెప్పాలంటే కరోనా దెబ్బతో చైనాలో మరణ మృదంగం మోగుతోంది. అటు చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ క్రమక్రమంగా అతి కొద్ది కాలంలోనే  70 దేశాలకు వ్యాపించింది. అంటే దీని ప్రభావం ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 


కరోనా వైరస్ గురించి చైనా శాస్త్రవేత్తలు మరో కొత్త విషయం బయట పెట్టారు.  కరోనా వైరస్ లోనే రెండు రకాలు ఉన్నాయని వెల్లడించారు.  కరోనా వైరస్ పై పెకింగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్,  ఇన్సిట్యూట్ పాశ్చర్ ఆఫ్ షాంఘై పరిశోధనలు చేస్తున్నాయి.  ఇప్పటి వరకు తమ పరిశోధనల్లో రెండు రకాల కరోనా వైరస్ లను కనుగొన్నామని వెల్లడించారు. వాటిలో వుహాన్ లో ఇన్ఫెక్షన్లకు కారణమైనది 70 శాతం దూకుడుగా ఉండేదని .. మిగతాది 30 శాతం తక్కువ దూకుడు గలదని వివరించారు. ఐతే దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని వెల్లడించారు. కరోనా వైరస్ కేవలం 5 నుంచి  7 రోజులు మాత్రమే జీవించగలదని తెలిపారు. మహా అయితే 14 రోజులు జీవించగలదన్నారు. 
 
మరోవైపు చైనాలో కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మంగళవారం  కేవలం 119 మాత్రమే కొత్త కేసులు నమోదయ్యాయని చైనా వైద్య ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. సోమవారం ఈ సంఖ్య 125గా ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..