)
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తన సుంకాల విధానమే ప్రపంచ శాంతికి కారణమైందన్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగకుండా నిలిపివేసిందని గర్వంగా ప్రకటించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, తన ఆర్థిక విధానాల వలన మాత్రమే అనేక దేశాలు యుద్ధాల నుంచి దూరంగా నిలబడ్డాయని ఆయన పేర్కొన్నారు.
ఒక మీడియా ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ... నాకు సుంకాలు విధించే అధికారం లేకపోతే, ఇప్పటికి కనీసం ఏడు యుద్ధాలలో నలుగురు జరిగిపోయేవి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ పరిస్థితిని చూస్తే వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అప్పట్లో ఏడు విమానాలు కూలిపోయాయి... కానీ నేను ఏమి మాట్లాడానో, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నానో చెప్పలేను. అయితే నేను చెప్పిన మాటలు చాలా ప్రభావవంతంగా మారాయి. సుంకాల విధానం వల్ల మేము వందల బిలియన్ డాలర్లు సంపాదించడమే కాకుండా, శాంతి పరిరక్షకులుగా కూడా నిలిచాము. అని ఆయన తెలిపారు.
ట్రంప్ ఈ వ్యాఖ్యలను గతంలో ఐక్యరాజ్యసమితి వేదికపైనా పునరుద్ఘాటించారు. తన రెండవ పదవీకాలంలోని మొదటి ఏడు నెలల్లోనే ఏడు ప్రధాన యుద్ధాలను నిలిపివేసానని.. దశాబ్దాలుగా జరుగుతున్న యుద్ధాలను ముగించగలిగిన నాయకుడిని నేను అని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ శాంతి కోసం చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతికి అర్హత ఉన్నానని కూడా ఆయన ఆత్మవిశ్వాసంగా పేర్కొన్నారు.
ట్రంప్ పరిపాలన కాలంలో అమెరికా విదేశాంగ విధానం చాలా విభిన్నంగా సాగింది. సాంప్రదాయ డిప్లమసీకి బదులుగా, ఆయన ఆర్థిక ఒత్తిళ్లు, సుంకాలు నేరుగా ఫోన్ సంభాషణల ద్వారా ప్రపంచ నేతలపై ప్రభావం చూపే ప్రయత్నం చేశారు. 2020లో వైట్ హౌస్ ప్రతినిధులు విడుదల చేసిన ఒక నివేదికలో, ట్రంప్ జోక్యంతో యుద్ధాలను నిలిపిన దేశాల జాబితా ఉందని పేర్కొన్నారు. అందులో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, కొరియా ద్వీపకల్ప పరిస్థితులు, మధ్యప్రాచ్యంలోని కొన్ని ఘర్షణలు కూడా ఉన్నాయని వెల్లడించారు.
ట్రంప్ దృష్టిలో సుంకాలు కేవలం వాణిజ్య సాధనం కాదు, అంతర్జాతీయ సంబంధాలను సమతుల్యం చేసే శక్తివంతమైన ఆయుధం. ఆర్థిక ఒత్తిడుల ద్వారా దేశాలు సంభాషణలకు సిద్ధమవుతాయని, యుద్ధం కంటే చర్చే పరిష్కారం అవుతుందని ట్రంప్ నమ్మకం. ఆయన మాటల్లో చెప్పాలంటే .. సుంకాల వల్ల మనం కేవలం అమెరికా కోసం మాత్రమే కాదు, ప్రపంచ శాంతి కోసం కూడా పనిచేశాము అని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడి ఈ వ్యాఖ్యలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కొందరు నిపుణులు ఆయన వాదనను అంగీకరించగా, మరికొందరు సుంకాల ప్రభావం కంటే దౌత్య చర్చలే కీలకమని వ్యాఖ్యానిస్తున్నారు. అయినప్పటికీ, ట్రంప్ తన సొంత శైలిలో అమెరికా ఆర్థిక శక్తిని ప్రపంచ రాజకీయాలలో ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకున్న విషయం మాత్రం తిరస్కరించలేనిది.
ట్రంప్ చెప్పిన 7 దేశాలు ఇవే..!
*భారత్, పాకిస్తాన్
*ఇజ్రాయెల్, ఇరాన్
*థాయిలాండ్, కంబోడియా
*రువాండా, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్
*సెర్బియా, కొసావో
*అర్మేనియా, అజర్బైజాన్
*ఈజిప్ట్, ఇథియోపియా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.