)
Modi Government: దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం తాలిబన్లు తిరుగుబాటు ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కిచ్చుకున్నారు. ఆ సమయంలో ఆఫ్ఠానిస్తాన్ లో ఉన్న భారత రాయబారులను వెనక్కి రప్పించుకుంది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఎలాంటి దౌత్య సంబంధాలు లేకున్నా..ప్రశాంతంగానే ఉన్నాయి. అయినప్పటికీ.. ఢిల్లీ ఇప్పటికీ తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే పరిస్థితి కొంతమేర మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
2021 ఆగస్టులో తాలిబన్ మళ్లీ కాబూల్‌పై అధికారం చెలాయించింది. ఆ తర్వాత అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ ఆ దేశంతో సంబంధాలు తెంచుకున్నాయి. తాలిబన్ తామే ప్రభుత్వమని ప్రకటించినా, చాలా దేశాలు దానిని అంగీకరించలేదు. భారతదేశం కూడా అదే విధానాన్ని అనుసరించింది. అయితే ఇప్పుడు, ఆ బంధం కొద్దిగా కరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే.. తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ త్వరలో ఢిల్లీ పర్యటనకు రావచ్చని సమాచారం. ముఖ్యంగా ఆయనపై ఉన్న యూఎన్ఎస్సీ ప్రయాణ నిషేధం తాజాగా ఎత్తివేసిన నేపథ్యం ఆసక్తికరంగా మారింది.
అమీర్ ఖాన్ ముత్తాకీ తాలిబన్లో సీనియర్ నాయకుడు. 1990లలో మొదటి తాలిబన్ పాలన సమయంలో ఆయన విద్యామంత్రిగా పనిచేశారు. ఆ కాలంలో జరిగిన హింసాత్మక చర్యల్లో ఆయనకు ప్రమేయం ఉందన్న కారణంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆయనపై ప్రయాణ నిషేధం విధించింది. దాంతో ఆయన ఏ దేశానికీ వెళ్లలేకపోయారు. ఆ నిషేధం ఉద్దేశం తాలిబన్ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడమని స్పష్టంగా అర్థం అవుతోంది. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో శాంతి చర్చల కోసం యూఎన్ కొంత సడలింపు ఇచ్చింది. ఇటీవల పశ్చిమ దేశాలు తాలిబన్ పట్ల కొంత మృదువైన వైఖరి అవలంబించడంతో ముత్తాకీ ప్రయాణ నిషేధం తాత్కాలికంగా ఎత్తివేసింది.
1990లలో తాలిబన్ మొదట అధికారంలోకి వచ్చినప్పుడు భారతదేశం ఆ పాలనను గుర్తించలేదు. కారణం వారి ఉగ్రవాద భావజాలం మాత్రమే కాదు. పాకిస్తాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా. తాలిబన్‌ను గుర్తించడం అంటే కాశ్మీర్లో ఉగ్రవాదానికి దారులు తెరుచుకోవడం అవుతుందని ఢిల్లీ భావించింది. అదే సమయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కాందహార్‌లో హైజాక్ కావడం పరిస్థితిని మరింత కఠినతరం చేసింది. 2021లో తాలిబన్ మళ్లీ అధికారంలోకి రాగానే, భారతదేశం దౌత్య సంబంధాలు తెంచుకున్నా, ఈసారి స్పందన కొంత మృదువుగా ఉందనే చెప్పవచ్చు. మానవతా సహాయం పేరుతో భారత అధికారులు కాబూల్ వెళ్లారు కూడా. ఇది పాత విధానంతో పోలిస్తే సానుకూల పరిణామమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తాలిబన్‌కు అధికారిక గుర్తింపు లభించకపోయినా, అంతర్జాతీయ వేదికపై అది పూర్తిగా ఒంటరిగా లేదు.
నేపాల్‌లో హింస, బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత, శ్రీలంక–పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, చైనాతో సరిహద్దు వివాదం..వీటన్నింటిని నేపథ్యలో ముత్తాకీ ఢిల్లీ పర్యటన జరగబోతుందనే ఊహాగానాలు రాజకీయంగా ప్రాధాన్యత పొందాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో చైనా ప్రభావం పెరుగుతున్న క్రమంలో, భారతదేశం కూడా అక్కడ మళ్లీ తన స్థానం బలపరచాలనుకుంటోంది. దీని ద్వారా కాబూల్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వకుండా నిరోధించాలనే లక్ష్యం ఉంది.
పాకిస్తాన్ చాలా కాలంగా ఆఫ్ఘనిస్తాన్‌ను భారత వ్యతిరేక కార్యకలాపాలకు వేదికగా వాడుకుంది. కానీ ప్రస్తుతం తాలిబన్–పాకిస్తాన్ సంబంధాలు సరిగా లేవు. పాకిస్తాన్ తన భూభాగంలో ఉగ్రదాడులకు తాలిబన్ మద్దతు ఇస్తోందని ఆరోపించింది. దీనిపై ఇరుపక్షాల మధ్య సరిహద్దు ఘర్షణలు కూడా జరిగాయి. ఈ విభేదాలు భారతదేశానికి అవకాశంగా మారే అవకాశం లేకపోలేదు. కాబూల్‌తో సంబంధాలు పెంచడం ద్వారా ఢిల్లీకి భద్రతా పరంగా లాభం కలుగుతుంది.
భారతదేశం ఆసియాలో పెద్ద శక్తిగా నిలుస్తోంది. అంతర్జాతీయంగా ఒంటరైన తాలిబన్‌కు భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం అత్యవసరం. భారతదేశం నుండి వచ్చే ఆర్థిక సహాయం, అంతర్జాతీయ వేదికల్లో దౌత్య మద్దతు వారికి ఎంతో దోహదం చేస్తాయి. ఆ సహకారం తాలిబన్ ఇమేజ్ను కూడా కొంతవరకు మెరుగుపరచగలదని చెప్పాలి.
తాలిబన్ మారిపోయామని చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి ఇంకా భిన్నంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల హక్కులు తీవ్రంగా క్షీణించాయి. యుక్తవయస్సు దాటిన బాలికలను పాఠశాలకు పంపించడం నిషేధించారు. మహిళలు స్వతంత్రంగా ప్రయాణించలేరు, ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం తాలిబన్‌ను అధికారికంగా గుర్తించడం రాజకీయంగా అసాధ్యమే. అయితే, దౌత్య చర్చల ద్వారా కొంత సర్దుబాటు సాధ్యమవుతుందేమో చూడాలి.
తాలిబన్‌ను గుర్తించడం ఇప్పుడే సాధ్యం కాకపోయినా, ఆ దిశగా చిన్నచిన్న అడుగులు వేయడం ప్రారంభమైందనిపిస్తోంది. ఢిల్లీ–కాబూల్ మధ్య ఈ సున్నితమైన దౌత్యం రాబోయే నెలల్లో ఏ రూపం దాల్చుతుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి, స్థిరత్వం లేకుండా దక్షిణాసియాలో భద్రత సాధ్యం కాదు. ఈ నేపథ్యలో భారత్ పాత్ర మరింత కీలకమవుతోందనే చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.