రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం భేటీ కానున్నారు. భారత్‌, రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం వీరిరువురూ సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం బయల్దేరి వెళ్లిన ప్రధాని.. రష్యాలోని సోచి నగరంలో పుతిన్‌తో భేటీ కానున్నారు. వీరి భేటీ నాలుగు నుంచి ఆరు గంటలపాటు సాగే అవకాశముందని సమాచారం. ద్వైపాక్షిక అంశాల కంటే అంతర్జాతీయ పరిణామాలపై కీలక చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో.. తాను జరిపే చర్చలు ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘మైత్రీపూర్వక రష్యా ప్రజలకు వందనం. పుతిన్‌ను ఎప్పుడు కలుసుకున్నా నాకు అదొక సంతోషం’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, ఉగ్రవాదం, త్వరలో జరగనున్న ఎస్‌సీవో, బ్రిక్స్‌ సదస్సులు సహా పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై మోదీ, పుతిన్‌లు చర్చించే అవకాశం ఉంది.