)
POJK: పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొన్నిరోజులుగా పీవోజేకేలో నిరసనలు జరుగుతున్నాయి. పీవోజేకే ప్రజల ప్రాథమిక హక్కులను పాకిస్తాన్ కాల రోస్తోందని నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పీవోజేకేలో పౌరుల హక్కులు అమలు చేయాలంటూ 38 డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. ప్రస్తుత నిరసనలు ప్లాన్-ఏ అని, ఇంకా తమ వద్ద వేరే ప్లాన్ కూడా ఉన్నాయని అవామీ యాక్షన్ కమిటీ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ప్రజలు తీవ్ర అశాంతితో రగిలిపోతున్నారు. స్థానికంగా జలవిద్యుత్ భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నప్పటికీ అధిక స్థాయిలో కరెంట్ బిల్లులు చెల్లించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అక్కడి వారు మండిపడుతున్నారు. పరిశ్రమలు లేవు. ఉద్యోగాలు లేవు, పేదరికం పెరిగిపోతోంది. ప్రస్తుత పరిస్థితులపై పాకిస్థాన్ పాలకులు పెంచకపోవడంతో స్థానిక ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వసతులు కల్పించడం కూడా ఆగ్రహానికి కారణమవుతోంది.
భారత్‌లోని జమ్మూకశ్మీర్ నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికి పాకిస్థాన్ పార్లమెంట్లో కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ సీట్లలో తమకు నచ్చిన వారిని నియమించి ఇక్కడి అసెంబ్లీని అస్థిరపరిచే యత్నాలను పాకిస్థాన్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇలా మొత్తం 38 డిమాండ్లతో పీవోజేకే ప్రజలు ఉద్యమిస్తున్నారు. వీటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఇస్తున్న హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ప్రజలు రగిలిపోతున్నారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సాయుధ బలగాలను రంగంలోకి దింపి ఆందోళనను అణచివేసే ప్రయత్నం చేస్తోంది.
ఈ ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించింది. ఇంటర్నెట్ను నిలిపివేసింది. ఈ నిరసనలతో మార్కెట్లు, దుకాణాలు, రవాణా సేవలు నిలిచిపోయాయి. ఈ ఉదయం ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. గత 4రోజులుగా పాక్ సైన్యం చేస్తున్న దాడులతో ప్రజలు లాక్డౌన్లోకి వెళ్లిపోయారు. వారికి కనీసం ఆహారం, ఇంధనం కూడా లభించడం లేదు. పాక్ సైన్యం దాడుల్లో అక్కడి పత్తి పొలాలు ధ్వంసమయ్యాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఛశ్మా ప్రాంతంలో మోర్టార్ల కారణంగా కొంత మంది పౌరులు మరణించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పూర్తిస్థాయి సమాచారం తెలియడం లేదు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రజలపై అణచివేతను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అమాయకులైన ప్రజలపై భద్రతా బలగాలు అమానుష చర్యలు, హక్కుల ఉల్లంఘనకు పాకిస్థాన్‌ను జవాబుదారి చేయాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ డిమాండ్ చేసింది. ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో పాలకుల విధానాలే అశాంతికి కారణమని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.