)
Israel-Hamas war: మధ్యప్రాచ్యంలో శాంతి వాతావరణం నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రణాళికను ప్రకటించారు. గాజా సంక్షోభం పరిష్కారానికి 20 సూత్రాలను సూచిస్తూ, యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్‌కు స్పష్టమైన సందేశం పంపారు. ట్రంప్ సూచనలపై స్పందించిన హమాస్, తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి అంగీకరించి, మిగిలిన అంశాలపై చర్చించేందుకు సిద్ధమని తెలిపింది. అంతేకాకుండా గాజా పరిపాలనను తాత్కాలికంగా పాలస్తీనా టెక్నోక్రాట్స్కి అప్పగించేందుకు కూడా సిద్ధమని ప్రకటించింది.
హమాస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ట్రంప్ హెచ్చరికనే అని చెప్పవచ్చు. ప్రతిపాదనలు అంగీకరించకుంటే గాజా మరింత నరకం అనుభవించాల్సి వస్తుంది అంటూ ట్రంప్ గట్టిగా హెచ్చరించడం హమాస్‌పై ఒత్తిడిని పెంచింది. ఫలితంగా హమాస్ అంతర్జాతీయ మధ్యవర్తుల సమక్షంలో చర్చలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చి, అరబ్, ఇస్లామిక్ దేశాలతో పాటు అమెరికా పాత్రను కూడా అభినందించింది.
ట్రంప్ సూచనలతో హమాస్ శాంతి వైపు అడుగులు వేయడం అంతర్జాతీయ వర్గాల్లో ప్రశంసలు పొందింది. కానీ ట్రంప్ సూచనలను ఇజ్రాయెల్ బేఖాతర్ చేసింది. ఇజ్రాయెల్ వెంటనే దాడులు కొనసాగించింది. గాజా నగరంలోని ఓ ఇంటిపై జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, దక్షిణ ఖాన్ యూనిస్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక అధికారులు ధృవీకరించారు. ఇది శాంతి ప్రక్రియకు ఆటంకం కలిగించే పరిణామంగా భావిస్తున్నారు.
హమాస్ సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి దాడులు ఆపితేనే బందీలు సురక్షితంగా విడుదలవుతారు. యుద్ధం కొనసాగితే పరిస్థితి తీవ్రతరం అవుతుంది. ఇది కేవలం గాజా సమస్య మాత్రమే కాదు, మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతి కోసం జరుగుతున్న పోరాటం అని తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
హమాస్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు స్వాగతించినప్పటికీ, అదే సమయంలో సైనిక దాడులు కొనసాగించడం గమనార్హం. శాంతి చర్చలకు సానుకూల సంకేతం ఇస్తూనే, మరోవైపు యుద్ధాన్ని కొనసాగించడం ఇజ్రాయెల్ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.