10 రోజులుగా కనిపించకుండా పోయిన ఫుట్‌బాల్ టీమ్ ఆచూకీ లభ్యం.. కానీ!
థాయ్‌లాండ్‌లో కనిపించకుండా పోయిన ఫుట్‌బాల్ టీమ్ ఆచూకీ లభించింది.
థాయ్‌లాండ్‌లో కనిపించకుండా పోయిన ఫుట్‌బాల్ టీమ్ ఆచూకీ లభించింది. వారంతా ఓ గుహలో ప్రాణాలతో ఉన్నారని థాయ్‌లాండ్ అధికారులు ప్రకటించారు. థామ్ లూవాంగ్ గుహలో 12 మంది సభ్యుల ఫుట్‌బాల్ జట్టుతో పాటు కోచ్ సజీవంగా ఉన్నారని తెలిపారు. గత నెల 23 నుంచి వీరంతా కనిపించకుండా పోగా.. వీరికోసం తీవ్రంగా గాలిస్తున్న అధికారులు వరదల కారణంగా ఓ గుహలో చిక్కుకున్నట్లు తెలిపారు. కాగా ఆ ఆటగాళ్లంతా 11-16 ఏళ్ల వారే కాగా.. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకి తీసుకొచ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.
థామ్ లూవాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది బాలలు, కోచ్ సురక్షితంగా ఉన్నా.. వారు బయటకు వచ్చేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని సమాచారం. ఈ గుహలో ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు సెప్టెంబర్-అక్టోబర్ వరకు తగ్గుముఖం పట్టదని తెలుస్తోంది. 11-16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు బయటకు రావాలంటే ప్రవాహానికి 4 కిలోమీటర్లు ఎదురీదాలి. ఇది కష్టమని భావిస్తున్న థాయ్ ఆర్మీ.. వారికి 4 నెలలకు సరిపడా ఆహారాన్ని పంపేందుకు ఏర్పాటు చేస్తోంది.
ఫుట్‌బాల్ టీమ్ ప్రాక్టీస్ ముగిశాక ఈ నెల 23న దగ్గర్లోని థామ్ లూవాంగ్ గుహ సందర్శనకు వెళ్లగా.. ఒక్కసారిగా భారీ వర్షం పడటం.. లోపలికి చేరటంతో వారంతా అందులో చిక్కుకుపోయారు.
వారు బయటికి రావడం కష్టమని అందరూ భావించారు. కానీ అధికారులు మాత్రం ఆశలు వదులుకోకుండా ఆచూకీని కనుగొన్నారు. థాయ్ నేవీ సీల్(SEAL) డైవర్స్‌తోపాటు బ్రిటీష్ డైవర్స్, మిలిటరీ బృందం, పారా రెస్క్యూ సిబ్బంది, మరికొందరు రక్షణ రంగ నిపుణులను రంగంలోకి దింపి భారీ రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రజలు, బౌద్ధ సన్యాసులు వారంతా సురక్షితంగా తిరిగి రావాలని పూజలు చేస్తున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నట్లు.. అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది వీడియోను అధికారులు విడుదల చేశారు.