)
Trump Targets India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి (యూఎన్) సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ, భారత్,పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని పునరుద్ఘాటించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరపగా, రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో యుద్ధం మొదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తన జోక్యంతో ఆ యుద్ధాన్ని నిలిపివేశానని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ ఇదే విషయాన్ని గతంలో పలుమార్లు చెప్పినప్పటికీ, తాజాగా యూఎన్ వేదికపైనే మరోసారి స్పష్టం చేశారు. భారత్–పాక్ యుద్ధమే కాకుండా, ఇజ్రాయెల్–ఇరాన్, కాంబోడియా–థాయ్‌లాండ్, కొసోవో–సెర్బియా, కాంగో–రువాండా, ఈజిప్ట్–ఇథియోపియా, ఆర్మేనియా–అజర్బైజాన్ మధ్య జరిగిన ఘర్షణలను కూడా తానే ఆపానని ట్రంప్ చెప్పారు. కేవలం ఏడు నెలల్లో ఏడు యుద్ధాలను ఆపిన నాయకుడిగా తనను తాను పేర్కొంటూ, ఇది తనకు గౌరవ కరమైన విషయమని వ్యాఖ్యానించారు.
యుద్ధాలు ఆగేలా చేయడంలో ఐక్యరాజ్యసమితి ఎలాంటి సహకారం అందించలేదని, తమవంతు చర్య తీసుకోకపోవడం బాధాకరమని ట్రంప్ విమర్శించారు. ఆయా దేశాధినేతలతో నేరుగా చర్చించి తానే మధ్యవర్తిత్వం చేశానని తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌పైన మరోసారి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా భారత్, చైనా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్ల ఉక్రెయిన్‌పై యుద్ధానికి సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నాటో దేశాలు కూడా రష్యాపై తగిన ఆంక్షలు విధించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఆర్థిక విషయాలపై మాట్లాడుతూ.. అమెరికా ప్రస్తుతం స్వర్ణయుగంలో ఉందని ట్రంప్ అన్నారు. వ్యాపారం చేసుకోవడానికి అమెరికా ప్రపంచంలోనే ఉత్తమ దేశమని, అమెరికా సరిహద్దులు, ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి మరింత బలపడుతున్నాయని చెప్పారు. సుంకాలు, ఆంక్షలు సరైన విధంగా ఉపయోగిస్తే రక్తపాతం త్వరగా ఆగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. యూరప్ దేశాలు కూడా అమెరికాతో కలిసి పనిచేస్తే యుద్ధాలు నిమంత్రించవచ్చని సూచించారు.
అంతేకాకుండా, ఐక్యరాజ్యసమితి తన సామర్థ్యాన్ని వృథా చేసుకుంటోందని, అవసరమైన సమయంలో ఎలాంటి సహకారం అందించడం లేదని మరోసారి విమర్శించారు. పాలస్తీనా రాష్ట్ర హోదాకు సంబంధించిన ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్, గాజా యుద్ధం వెంటనే ఆగాలని కోరారు. బందీలను ఆలస్యం లేకుండా విడుదల చేయాలని కూడా సూచించారు.
ప్రసంగం మధ్యలో టెలిప్రాంప్టర్ పనిచేయకపోవడంతో ఒకింత గందరగోళం ఏర్పడినా, తాను ఆ సాంకేతిక సమస్యలతో సంబంధం లేకుండా మాట్లాడగలనని ట్రంప్ చమత్కరించారు. తాను యుద్ధాలను ఆపిన నాయకుడిగా గుర్తింపు పొందడం గౌరవంగా భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యలు మరొక సారి చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.