సరిహద్దుల్లో టెన్షన్: పాక్‌కు ధీటుగా బదులిస్తున్న భారత్

శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి నుంచి పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులకు భారత్ ధీటుగా బదులిస్తోంది.

Last Updated : Jun 3, 2018, 08:49 PM IST
సరిహద్దుల్లో టెన్షన్: పాక్‌కు ధీటుగా బదులిస్తున్న భారత్

శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి నుంచి పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులకు భారత్ ధీటుగా బదులిస్తోంది. పాక్ కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు అమరులవగా.. అప్రమత్తమైన భారత బలగాలు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ నిర్మించిన 10 బంకర్లను ధ్వంసం చేశాయి. శ్రీనగర్‌లో ఉగ్రవాదులు దాడులు మొదలుపెట్టగా వారికి కొనసాగింపుగా పాక్ ఆర్మీ గత రాత్రి నుంచి కాల్పులు జరుపుతోంది. డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరిగిన కొద్ది గంటలకే పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దాడులకు దిగడాన్ని ముఖ్యమంత్రి మెహబూబూ ముఫ్తీ తీవ్రంగా ఖండించారు.

అఖ్నూర్‌ సెక్టార్‌‌లో

ఆదివారం ఉదయం జమ్మూకాశ్మీర్‌లోని అఖ్నూర్‌ సెక్టార్‌లో పాక్‌ రేంజర్ల కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి చెందగా, ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ పాండే, ఏఎస్‌ఐ సత్య నారాయణ్ యాదవ్ మృతి చెందినట్లు బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. పాక్ రేంజర్లు కాల్పులు జరపడంతో.. సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల నివాసాలు ధ్వంసమవుతున్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

శ్రీనగర్‌లో

శ్రీనగర్‌లో ఉగ్రవాదులు శనివారం గ్రనేట్ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో లోయలో మొత్తం 7 గ్రనేట్ దాడులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు గ్రనేడ్ దాడులకు పాల్పడిన ఘటనలో నలుగురు గాయపడ్డారు.

Trending News