గుంటూరు మీదుగా వెళ్లే రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

గుంటూరు మీదుగా వెళ్లే రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

Last Updated : Jun 29, 2019, 10:08 PM IST
గుంటూరు మీదుగా వెళ్లే రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

గుంటూరు: ఎప్పటికప్పుడు పెరుగుతున్న రైలు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గుంటూరు మీదుగా 26 ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం డి.వాసుదేవ రెడ్డి తెలిపారు. 07149 నెంబర్ కలిగిన సికింద్రాబాద్‌-కమాఖ్య ప్రత్యేక రైలు జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ప్రతి శుక్రవారం ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 11.16కి పిడుగురాళ్ల, 11.48కి సత్తెనపల్లి, మధ్యాహ్నం 12.50కి గుంటూరు, ఆదివారం ఉదయం 8.20కి కమాఖ్య చేరుకొంటుంది. 

అలాగే 07150 నెంబర్ గల కమాఖ్య- సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ప్రతి సోమవారం వేకువ జామున 5.42గంటలకు కమాఖ్య నుంచి బయలుదేరి మంగళ వారం అర్ధరాత్రి దాటాక 1.55కి గుంటూరు, 3.18కి సత్తెనపల్లి, 3.48కి పిడుగురాళ్ల మీదుగా బుధవారం ఉదయం 9.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. సికింద్రాబాద్-కమాఖ్య, కమాఖ్య-సికింద్రాబాద్ రైళ్లలో ఏసీ టూటైర్‌, రెండు త్రీటైర్‌ 12 స్లీపర్‌ క్లాస్‌ భోగీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు.

రైల్వే సీనియర్‌ డీసీఎం డి.వాసుదేవ రెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం 07053 నెంబర్ కలిగిన లింగంపల్లి - కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు ఈ నెల 28వ తేదీన సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి అర్ధరాత్రి దాటాక 12.18కి సత్తెనపల్లి, 1 గంటకు గుంటూరు, మరుసటి రోజు ఉదయం 8.30కి కాకినాడ టౌన్‌కు చేరుకొంటుంది. 

అలాగే 07054 నెంబర్ కలిగిన కాకినాడ టౌన్‌ - లింగంపల్లి ప్రత్యేక రైలు ఈ నెల 30వ తేదీన రాత్రి 8.45 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి అర్ధరాత్రి దాటాక 2.35కి గుంటూరు, 3.30కి సత్తెనపల్లి, మరుసటి రోజు ఉదయం 8గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. ఈ రైళ్లలోనూ ఏసీ టూటైర్‌, రెండు త్రీటైర్‌, ఒక ఏసీ టూ-కమ్‌-త్రీటైర్‌, 10 స్లీపర్‌ క్లాస్‌, నాలుగు జనరల్‌, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌ భోగీలు ఉంటాయి.

ఇకపై నిత్యం లింగంపల్లి - విజయవాడ - లింగంపల్లి మధ్య రాకపోకలు సాగిస్తోన్న 12796/12795 నెంబర్ కలిగిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకి అదనంగా రెండు ఏసీ ఛైర్‌కార్‌ భోగీలను జోడించనున్నారు. అయితే, జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని సీనియర్‌ డీసీఎం స్పష్టంచేశారు. అంతేకాకుండా 17229/17230 నెంబర్స్ గల శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలు‌కి అదనంగా మరో స్లీపర్‌ క్లాస్‌ భోగీ, 17243/17244 నెంబర్ గల రాయగడ ఎక్స్‌ప్రెస్‌కి అదనంగా మరో స్లీపర్‌ క్లాస్‌ భోగీ జత చేయనున్నారు. 

17625/17626 నెంబర్స్ కలిగిన డెల్టా ఎక్స్‌ప్రెస్‌కి సైతం అదనంగా మరో రెండు టూటైర్‌ ఏసీ భోగీలను జత చేయనున్నారు. అలాగే వరంగల్‌ మీదుగా విజయవాడ వరకు రాకపోకలు సాగించే 17705/12706 నెంబర్ గల ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకి రెండు ఏసీ ఛైర్‌ కార్‌ భోగీలు జత చేయనున్నారు. నిత్యం హైదరాబాద్ నుంచి గుంటూరు వైపుగా రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు ఇది కలిసొచ్చే అంశం అవుతుందని సీనియర్‌ డీసీఎం వాసుదేవ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Trending News