తెలుగుదేశం ఎంపీలను కొట్టినా సిగ్గూ, శరం లేదా.. కాంగ్రెస్‌తో కలుస్తారా: పవన్ కళ్యాణ్

కొంతమందికి ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆశ చాలా ఉందని.. కానీ తనకు రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే ఆశ అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 

Last Updated : Nov 3, 2018, 10:54 AM IST
తెలుగుదేశం ఎంపీలను కొట్టినా సిగ్గూ, శరం లేదా.. కాంగ్రెస్‌తో కలుస్తారా: పవన్ కళ్యాణ్

కొంతమందికి ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆశ చాలా ఉందని.. కానీ తనకు రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే ఆశ అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా బహిరంగ సభలో  మాట్లాడిన పవన్ పలు వ్యాఖ్యలు చేశారు. కొద్ది సంవత్సరాల క్రితం తునిలో రైలుబోగీలను తగలబెట్టిన విషయం తనకు చాలా ఆవేదనను, బాధను కలిగించిందని తెలిపారు. జనసేన నిర్మాణాత్మక రాజకీయాల ద్వారా అటువంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా జాగ్రత్త వహిస్తుందని తెలిపారు. అలాగే ప్రత్యేక హోదాపై కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

ప్యాకేజీ ఇచ్చినందుకు బీజేపీ నాయకులకు షాంపూ పెట్టి కుంకుడు కాయలు వేసి మంగళ స్నానాలు చేయించింది టీడీపీ పార్టీ అని పవన్ అన్నారు. అప్పుడు హోదా గురించి మాట్లాడేవారిని జైలుకి పంపిస్తామని స్వయానా చంద్రబాబే అన్నారని.. తర్వాత మళ్లీ ఆయనే మళ్లీ హోదా కోసం ధర్మపోరాట దీక్షలు చేశారని పవన్ ఎద్దేవా చేశారు. "నేను బీజేపీని ఏమీ అనడం లేదని అంటూ ఉంటారు. కానీ నాది హోదా పై ఎప్పుడూ ఒక్కటే మాట. విమర్శించడం అంటే బాలక్రిష్ణలా నీచంగా తిట్టడం కాదు. అలా తిడుతుంటే చంద్రబాబు నవ్వుకుంటారు. ఆయనకి అదో సరదా. కానీ విమర్శించడానికీ ఒక పద్ధతి ఉంటుంది. ఒక సంస్కారం ఉంటుంది" అని పవన్ అన్నారు. 

రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ ఎంపీలను కాంగ్రెస్ వాళ్లు కొట్టి అవమానిస్తే.. సీఎం చంద్రబాబుకి పౌరుషం రాలేదని.. మళ్లీ వెళ్లి కాంగ్రెస్ వాళ్లతోనే కలుస్తున్నారని.. సిగ్గూ శరం లేకుండా తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. రేపొద్దున జగన్‌తో చంద్రబాబు కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. చంద్రబాబు తత్వం అలాంటిదని పవన్ తెలిపారు. తాను కాంగ్రెస్‌తో చేరాడన్న కారణంతో తన సొంత అన్నయ్యనే వదిలి వచ్చి వేరే పార్టీ పెట్టానని పవన్ అన్నారు.  కానీ చంద్రబాబు మాత్రం ఏ కాంగ్రెస్ వారికి బుద్ధి చెప్పడానికి.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఎన్టీఆర్  తెలుగుదేశం పార్టీ పెట్టారో.. అదే పార్టీ అధినేతగా ఉండి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం.. రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమేనని అన్నారు. 

Trending News