చంద్రబాబు తన తండ్రి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తన భర్త అంటోన్న మహిళ

చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఆ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె చెప్పిన విషయం విని అవాక్కయ్యారు. 

Last Updated : Apr 6, 2018, 06:16 PM IST
చంద్రబాబు తన తండ్రి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తన భర్త అంటోన్న మహిళ

అందరికీ తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వున్నది ఒకే ఒక్క సంతానం నారా లోకేష్. ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కూడా అయిన నారా లోకేష్ తప్ప చంద్రబాబు నాయుడుకి ఇంకెవ్వరూ పిల్లలు లేరు. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన తండ్రి అంటూ అమరావతిలో వున్న చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతూ అందరికీ షాక్ ఇచ్చింది ఓ మహిళ. చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఆ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె చెప్పిన విషయం విని అవాక్కయ్యారు. చంద్రబాబు నాయుడు తన తండ్రి అని అమరావతి పోలీసులకు షాక్ ఇచ్చిన ఆ మహిళ అంతటితో ఆగలేదు... సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర అదనపు డీజీగా వుండి స్వచ్చంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తన భర్త అని ప్రకటించిందామె. అంతేకాకుండా ఐపీఎస్ లక్ష్మీ నారాయణకు చెందిన ఫోన్ నెంబర్ సైతం పోలీసులకు ఇచ్చింది.  

ఆ మహిళ వద్ద వున్న ఆధార్ కార్డుని పరిశీలించిన పోలీసులు, ఆమె పేరు ఎర్విన్ రిటా ఆశీర్వదాం అని, ఆమె స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా అని తెలుసుకున్నారు. ఆ మహిళ 1972లో జన్మించినట్టు ఆమె ఆధార్ కార్డు స్పష్టంచేస్తోంది. తాము అడిగిన మరిన్ని ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇస్తోన్న ఆ మహిళకు మతిస్థిమితం సరిగ్గా లేదని గుర్తించిన పోలీసులు.. బహుశా ఇక్కడే ఎక్కడో మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇలా అమరావతికి వచ్చి వుండవచ్చని భావిస్తున్నారు. 

Trending News