హోదా కన్నా ఎక్కువ చేయడానికి సిద్ధంగా ఉన్నాం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉద్ఘాటించింది.

Last Updated : Mar 18, 2018, 07:54 PM IST
హోదా కన్నా ఎక్కువ చేయడానికి సిద్ధంగా ఉన్నాం

చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (తెదేపా) జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నుండి నిష్క్రమించాక.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉద్ఘాటించింది.

శనివారం బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు సమావేశం అయ్యారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. అమిత్‌ షా నివాసంలో ప్రారంభమైన ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ సహా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, సీనియర్‌ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, సోము వీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌, విష్ణుకుమార్‌ రాజు తదితరులు హాజరయ్యారు. సమావేశం ముగిశాక బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విలేకరులతో మాట్లాడారు. "గత నాలుగు సంవత్సరాల్లో మేము ఆంధ్రప్రదేశ్‌కి ఏమి చేశామో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వివరించబోతున్నాం. మేము ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ చేయటానికి సిద్ధంగా ఉన్నాము" అని అన్నారు.

రాబోయే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో రాజకీయ తీర్మానం చేయబోతోందని, రాజకీయ తీర్మానం ద్వారా బీజేపీ వైఖరి ఏంటో రాష్ట్ర ప్రజల ముందు పెడతామని అన్నారు. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలపై మా వైఖరిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించాలని తీర్మానించాము. మేము ఆంధ్రా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాము. గత నాలుగు సంవత్సరాల్లో మేము ఎంతో చేశాము" అని రాంమాధవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇతర పార్టీలు ఎంత కట్టుబడి ఉన్నాయో అంతకంటే ఎక్కువగా బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అనేక విధాలుగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చిత్తశుద్ధితో సహకారం అందజేశామనీ, రాబోయే రోజుల్లో కూడా ఆ కృషి కొనసాగుతుందని చెప్పారు.

'వారు లేవనెత్తిన ప్రశ్నలకు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రజలకు సమాధానం చెబుతాం. అయితే ఇప్పటి వరకు తెలుగుదేశం, ముఖ్యమంత్రి మాత్రమే ప్రశ్నలు లేవనెత్తారు. రాబోయే రోజుల్లో మేము లేవనెత్తే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది' అని రాంమాధవ్ అన్నారు.ఎన్డీఏ కూటమిలోకి తెదేపా మళ్లీ తిరిగి వస్తుందా? అని అడిగినప్పుడు.. "అదేదో తెలుగుదేశం పార్టీనే అడగాలి" అని రాంమాధవ్ చెప్పారు.

అంతకుముందు శుక్రవారం నాడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ టీడీపీపై మండిపడ్డారు.  'ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇవ్వడానికి మేము సిద్ధమే. ఆ దిశగా అడుగులు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వారి రాకకై ఎదురుచూస్తున్నాము' అన్నారు. "ఒక పరిష్కారాన్ని టేబుల్ పై ఉంచాము. ఆంధ్రప్రదేశ్ కు వనరులే కావాలో లేక సమస్య చేయాలని కోరుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ తేల్చుకోవాలి' అని జైట్లీ పిటిఐకి తెలిపారు. 14వ ఆర్థిక కమిషన్‌ను అమలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించలేమని జైట్లీ పేర్కొన్నారు.

Trending News