అమృత్ పథకం అమలులో ఏపీకి ఫస్ట్..తెలంగాణకు నాల్గో ర్యాంకు

                       

Last Updated : Sep 24, 2018, 06:23 PM IST
అమృత్ పథకం అమలులో ఏపీకి ఫస్ట్..తెలంగాణకు నాల్గో ర్యాంకు

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన అమృత్ పథకం అమలులో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. 65.24 శాతం మార్కులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. 52.39 శాతం మార్కులతో తెలంగాణ రాష్ట్రం నాల్గో స్థానంలో నిలిచింది. మన పొరుగు రాష్ట్రాలైన ఒడిషా ( 59.17 శాతం మార్కులు), మధ్యప్రదేశ్ ( 54.32 శాతం మార్కులు) రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకోవడం గమనార్హం.

అమృత్ లక్ష్యం ఇదే...
మంచినీటి సరఫరా, మురుగు నీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు 2015 జూన్ 25న మోడీ సర్కార్ ఈ పథకం ప్రవేశపెట్టింది. దీన్ని ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు పక్కాగా అమలు చేశారు. ఫలితంగా ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. పథకం అమలు విషయంలో ఏపీతో పోటీ పడినప్పటికీ స్వల్ప తేడాతో తెలంగాణ రాష్ట్రం నాల్గో ర్యాంకు సాధించింది. ఏది ఏమైనప్పటికీ మన తెలుగు రాష్ట్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటడంపై తెలుగు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలపై ప్రసంశల జల్లు
 ఢిల్లీలో ఈ రోజు 'ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్' జాతీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ చేతుల మీదుగా అమృత్ మిషన్ ఏపీ డైరెక్టర్ కె.కన్నబాబుకు అవార్డుని అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ తెలుగు రాష్ట్రాల పనితీరును ప్రసంశించారు.

Trending News