కారుణ్య నియామకాలకు ఆర్టీసీ గుడ్‌బై!

ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) లో కారుణ్య నియామకాలకు యాజమాన్యం గుడ్‌బై చెప్పింది.

Last Updated : Jul 7, 2018, 08:23 AM IST
కారుణ్య నియామకాలకు ఆర్టీసీ గుడ్‌బై!

ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో కారుణ్య నియామకాలకు యాజమాన్యం గుడ్‌బై చెప్పింది. ఇకపై సర్వీసులో ఉన్న ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబంలో అర్హులకు ఉద్యోగం ఇచ్చే విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఆర్టీసీలో 1978 నుంచి అమలులో ఉన్న కారుణ్య నియామకాల విధానాన్ని రద్దు చేయడం పట్ల కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. 40 ఏళ్ల నుంచి వస్తున్న కారుణ్య నియామకాలను రద్దు చేసి తమ కుటుంబాలను రోడ్డున పడేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారుణ్య నియామకం వద్దనుకునే వారికి ఏఎంబీ కింద రూ.10 లక్షలు అందించాలని యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

కారుణ్య నియామకం కింద ఉద్యోగం వద్దనుకునే వారికి కొంత మొత్తం ఆర్టీసీ అందించే వీలుంది. గతంలో కారుణ్య నియామకం లేకుండా అడిషనల్‌ మానిటరీ బెనిఫిట్‌ స్కీం (ఏఎంబీ) కింద బాధితులకు రూ.లక్ష ఇచ్చేవారు. మూడవ, నాల్గవ తరగతి ఉద్యోగి కుటుంబానికి రూ.లక్ష.. రెండో తరగతి స్థాయి (సూపర్ వైజర్) ఉద్యోగి కుటుంబానికి రూ.1.25 లక్షలు, ఆఫీసర్‌ కేడర్‌ కుటుంబానికి  రూ. లక్షన్నర ఇచ్చేవారు. అయితే, ఇప్పుడు అన్ని కేడర్‌లకు ఒకే విధంగా, సర్వీసులో ఉన్న ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబాలకు రూ.5లక్షలు చెల్లించనున్నారు. అటు ఈ నిర్ణయం ఈ ఏడాది జూన్ 18 నుంచే అమలవుతోందని యాజమాన్యం ప్రకటించింది. కాగా, సంస్థ తీసుకున్న తాజా నిర్ణయం సుమారు 1,500 మందిపై ప్రభావం చూపనుంది.

Trending News