అదుగో మూవీ రివ్యూ

అదుగో మూవీ రివ్యూ

Last Updated : Nov 7, 2018, 03:57 PM IST
అదుగో మూవీ రివ్యూ

నటీనటులు : అభిషేక్ వ‌ర్మ‌, న‌భా నతేష్, ర‌విబాబు, ఉద‌య్ భాస్క‌ర్, ఆర్కే, వీరేంద‌ర్ చౌద‌రి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
మాట‌లు: ర‌విబాబు, నివాస్
సమర్పణ : సురేష్ ప్రొడక్షన్స్
నిర్మాణం : ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్
కథ -దర్శకత్వం -నిర్మాణం : రవి బాబు
నిడివి : 110 నిమిషాలు
విడుదల తేది : 07 నవంబర్ 2018
ఈగ కథాంశం ఆధారంగా సినిమా తీసి ఔరా అనిపించాడు రాజమౌళి.. రవి బాబు కూడా అదే రూట్లో పందితో ‘అదుగో’ అనే కామెడి ఎంటర్‌టైనర్ తెరకెక్కించాడు. మరి ఈరోజే థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేసింది.. రవి బాబు చేసిన ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అయ్యింది అనే విషయాలు తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ :
ఓ పల్లెటూరిలో ఓ పంది పిల్లను పెంచుకుంటాడు చంటి (సాత్విక్). దానికి బంటి అని పేరు పెట్టి అపురూపంగా చూసుకుంటాడు. అయితే ఓ రోజు ఇద్దరు వ్యక్తులు చంటిని కొట్టి బంటిని తీసుకెళ్తారు. అలా చంటి నుండి దూరమైన బంటి చివరికి హైదరాబాద్ చేరుకుంటుంది. బంటిని వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తాడు చంటి. హైదరాబాద్‌లో ఉండే సిక్స్ ప్యాక్ శక్తి (రవి బాబు), అలాగే బెజవాడలో ఉండే దుర్గ ఇద్దరూ పందిపిల్ల కోసం వెతుకుతుంటారు. అదే క్రమంలో మరో రెండు గ్యాంగులు కూడా పంది పిల్ల కోసం వెతుకుతుంటాయి. బంటి అటు తిరిగి ఇటు తిరిగి అభిషేక్ (అభిషేక్ వర్మ) దగ్గరికి చేరుతుంది. బంటి కోసం అభిషేక్ వర్మ గర్ల్ ఫ్రెండ్ రాజీ (నభా నటేష్)ని కిడ్నాప్ చేసి బంటిని అప్పచెప్పాల్సిందంటూ డిమాండ్ చేస్తాడు శంకర్(ఆర్ కే). ఈ క్రమంలో తన దగ్గర నుండి తప్పిపోయిన బంటి ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అభిషేక్. అలా అందరి టార్గెట్ బంటిని పట్టుకోవడమే.. అసలు ఇంత మంది బంటిని వెతకడానికి కారణం ఏమిటి ? చివరికి బంటి చంటి దగ్గరికి ఎలా చేరుకుంది ?  బంటి కోసం వెతికిన గ్యాంగులు ఏమయ్యాయి ? అనేదే అదుగో కథ.

నటీనటుల పనితీరు :
అభిషేక్ వర్మ మొదటి సినిమాతో పరవాలేదనిపించుకున్నాడు. నభా నటేష్ తన పాత్రకు తగినట్టుగా పర్ఫెక్ట్ అనిపించుకుంది. ఎప్పటిలాగే కామెడి విలన్‌గా మెప్పించాడు రవి బాబు. చైల్డ్ ఆర్టిస్ట్స్ సాత్వీక్, ప్రణవి మంచి నటన కనబరిచారు. సినిమా చివర్లో స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకుంది పూర్ణ. బంటికి రాజేంద్ర ప్రసాద్ అందించిన వాయిస్ ఓవర్  బాగా కుదిరింది. విజయ్ తన డైలాగ్ కామెడి అలరించాడు. కాశీ విశ్వనాధ్, ఆర్.కే, వీరేందర్ చౌదరి మిగతా నటీనటులు తమ కామెడి క్యారెక్టర్స్‌తో నవ్వించే ప్రయత్నం చేసి పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు :
అదుగో సినిమాకు సంబంధించి టెక్నికల్‌గా చెప్పుకోవాల్సింది ముందుగా విజువల్ ఎఫెక్ట్స్ గురించి.. లైవ్ యానిమేషన్ 3D టెక్నాలజీతో పందిని క్రియేట్ చేసి తమ వర్క్‌తో మెప్పించింది గ్రాఫిక్స్ టీం. ప్రశాంత్ ఆర్ విహారి సౌండింగ్‌తో సినిమాకు ప్లస్ అయ్యాడు. కొన్ని సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సందర్భాల్లో వచ్చే కామెడీ డైలాగ్స్ అలరిస్తాయి. రవి బాబు కథ -కథనం ఆకట్టుకోలేకపోయాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

కామెడి సినిమాలు, థ్రిల్లర్ సినిమాలతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న రవిబాబు ఈసారి మరో ప్రయోగం చేసాడు. పందిపిల్లతో సినిమా తీసి అందరినీ ఎట్రాక్ట్ చేసాడు. అయితే దాదాపు మూడేళ్ళకు పైగా ఈ సినిమా గురించి ప్రమోట్ చేస్తూ సినిమాపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు రవిబాబు. చాలా సందర్భాల్లో పందిపిల్లను ఎత్తుకొని ప్రమోషన్ చేసిన రవి బాబు ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. రిలీజ్‌కి ముందు పందితో పాదయాత్ర అని కొత్త ప్లాన్ వేసినా సినిమాపై హైప్ మాత్రం రాలేదు.

నిజానికి పందితో ఒక కామెడి ఎంటర్టైనర్ తీయాలనుకున్నప్పుడు కాస్త కొత్తగా ఏదైనా ట్రై చేసి ఉంటే బాగుండేది. పంది అనే ఎలిమెంట్ తప్ప సినిమా అంతా పాత చితకాయ పచ్చడే. చాలా సన్నివేశాల్లో రవిబాబు గత సినిమాలు గుర్తుకొస్తాయి. సినిమా ప్రారంభంలో కాస్త ఆసక్తిగా అనిపించినా తర్వాత గ్యాంగులు, కిడ్నాపులు, ప్రేమ ఇలా అన్నీ రొటిన్ అనిపిస్తాయి. సినిమా మొత్తానికి లైవ్ యానిమేషన్ 3D టెక్నాలజీతో చేసిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మెయిన్ హైలైట్‌గా నిలిచింది. అది తప్ప సినిమాలో మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేదు.

గతంలో రవి బాబు తీసిన కొన్ని ప్రయోగాలలో కొన్ని విజయాలు అందుకున్నాయి అలాగే అపజయాలు ఉన్నాయి. అదుగో మూవీ రవిబాబు నుండి వచ్చిన మరో బోరింగ్ సినిమా అని చెప్పొచ్చు. కొన్ని కామెడి సన్నివేశాలు ప్రేక్షకులను కొంత వరకూ అలరిస్తాయి కానీ మరీ పొట్ట చెక్కలు అయ్యేంత కామెడి మాత్రం ‘అదుగో’లో లేదు. ఫైనల్‌గా పందితో రవి బాబు చేసిన ఈ ప్రయోగాత్మక సినిమా చిన్న పిల్లలకు నచ్చుతుంది.

రేటింగ్ : 1.5 / 5
 

Trending News