వైవిధ్యమైన హాస్యానికి మారుపేరు.. గుండు హనుమంతరావు

ఇటీవలే ఓ టీవీ ఛానల్‌‌లో ప్రముఖ నటుడు ఆలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యలను గురించి, ఆర్థిక సమస్యల గురించి తొలిసారిగా బహిర్గతం చేశారు గుండు.

Last Updated : Feb 19, 2018, 04:56 PM IST
వైవిధ్యమైన హాస్యానికి మారుపేరు.. గుండు హనుమంతరావు

చిన్నప్పటి నుండీ నాటకాలంటే చెవికోసుకొనే ఓ కుర్రాడు.. హాస్యబ్రహ్మ జంధ్యాల చేతులలో పడడంతో సినీ నటుడయ్యాడు. తనదైన శైలిలో హాస్యాన్ని పండించి దాదాపు ఆరు వందల చిత్రాలకు పైగా నటించాడు.  తర్వాత టీవీ సీరియల్స్‌లో కూడా నటించి అందరి మెప్పూ పొందాడు. నంది అవార్డులూ గెలుచుకున్నాడు.. అతడే గుండు హనుమంతరావు.

గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ రోజే హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడవడంతో.. యావత్ తెలుగు సినీ పరిశ్రమే దిగ్భ్రాంతి చెందింది. తనకంటూ ఉన్న ప్రత్యేకమైన హావభావాలతో హాస్యాన్ని పండించి టాలీవుడ్ ప్రేక్షకుల మనసులను దోచుకున్న హాస్యనటుడు "గుండు" జీవితంలోని పలు ఘట్టాలను మనం కూడా ఓసారి నెమరువేసుకుందాం...!

నాటకాలంటే విపరీతమైన పిచ్చి..!
అక్టోబరు 10, 1956లో విజయవాడలో సరోజిని, కాంతారావు దంపతులకు జన్మించిన గుండు హనుమంతరావుకి చిన్నప్పటి నుండీ నాటకాలంటే విపరీతమైన పిచ్చి. తొలుత ప్రేక్షకుడిగా అనేక నాటకాలను చూసిన ఆయన, తర్వాత తాను కూడా ఓ మంచి నటుడిగా మారాలని, రాణించాలని ఆకాంక్షించారు. అదే ఆసక్తితో పలు నాటకాల్లో నటించారు. ఆయన వేసిన మొట్టమొదటి వేషం "రావణబ్రహ్మ". ఓసారి మద్రాసులో గుండు నటించిన ఓ నాటకాన్ని చూసిన ప్రముఖ దర్శకుడు జంధ్యాల.. తనను సినిమాల్లో నటించమని అడిగారు. ఆ దిశగా ప్రోత్సహించారు కూడా. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "అహనా పెళ్ళంట" చిత్రంలో గుండు నటించిన చెవిటి మాలోకం పాత్ర తనకు తీసుకొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. బాగా నిడివి తక్కువున్న పాత్ర అయినా.. ప్రేక్షకులు పదికాలాలు పాటు గుర్తుంచుకొనే పాత్ర కావడంతో హనుమంతరావుకి ఆ తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి.

దాదాపు 600 చిత్రాలకు పైగా..
తెలుగు చలన చిత్రాల్లో అన్ని వేషాలూ కలిపి దాదాపు 600 పాత్రలు పోషించిన గుండు.. బాబాయ్ హోటల్, యమలీల, వినోదం, మావిచిగురు లాంటి చిత్రాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. సినిమాల్లో నటించకముందు ఆయనకు ఓ స్వీట్ షాపు ఉండేది. సినిమాల్లో బాగా అవకాశాలు రావడంతో ఆయన తన వ్యాపారాన్ని వదిలి, కుటుంబంతో సహా విజయవాడ నుండి హైదరాబాద్ మకాం మార్చారు. అలాగే ఆదితాళం, అమృతం, శ్రీమతి శ్రీ సుబ్రమణ్యం వంటి టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. ఆ సీరియల్స్‌లో నటనకు గాను నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు.

అమృతంలో నటనకు అఖిల ప్రేక్షకాదరణ..!
సినిమాల్లో వచ్చిన పాపులారిటీ కన్నా.. అమృతం సీరియల్ ద్వారా గుండు హనుమంతరావుకి వచ్చిన పాపులారిటీ చాలా ఎక్కువ. ఆ సీరియల్‌లో అమృతరావు స్నేహితుడైన అంజి అలియాస్ ఆంజనేయులుగా, గుండు పాత్రను రక్తి కట్టించిన తీరు యావత్ తెలుగు ప్రజలను కడుపుబ్బా నవ్వించేలా చేసింది. అమృత విలాస్ హోటల్‌ ఓనర్లలో ఒకడిగా.. అలాగే వంటవాడిగా అంజి ఇచ్చే ఐడియాలకు జనాలు ఫిదా అయిపోయారు. ఆ సీరియల్‌లో అంజి పాత్రలో గుండు హనుమంతరావుని తప్పించి.. ఇంకెవరనూ ఊహించలేం అన్నది సత్యమని ఓ ఇంటర్వ్యూలో నిర్మాత గంగరాజు గుణ్ణం కూడా తెలపడం గమనార్హం. గుండు హనుమంతరావుకు ఉన్న అలవాట్లలో ఛలోక్తులు విసరడం, జోక్స్ చెప్పడం కూడా ఒకటి. వాటిని హాస్య గుళికలు అంటారు ఆయన.

అమృతం సీరియల్ పూర్తయ్యాక.. అప్పుడప్పుడు అడపా దడపా సినిమాల్లో నటించిన గుండు... ఆ తర్వాత పూర్తిగా నటించడం మానేశారు. ఇంటికే పరిమితమయ్యారు. 2010లో ఆయన సతీమణి ఝాన్సి రాణితో పాటు కొద్ది కాలం తర్వాత కుమార్తె కూడా మరణించడంతో మానసికంగా కూడా కుంగిపోయారు ఆయన. తన కుమారుడితో కలిసి ఎస్సార్ నగర్‌లో ఒంటరిగా కాలం గడిపేవారు.

ఇటీవలే ఓ టీవీ ఛానల్‌‌లో ప్రముఖ నటుడు ఆలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యలను గురించి, ఆర్థిక సమస్యల గురించి తొలిసారిగా బహిర్గతం చేశారు గుండు.  తన కిడ్నీ సంబంధిత వ్యాధి గురించి కూడా ప్రేక్షకలోకానికి అప్పుడే తెలిసింది. మా అసోసియేషన్‌తో చిరంజీవి లాంటి స్టార్ హీరోలు కూడా గుండుకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆయన ఆరోగ్యం కోలుకుంటుంది అని ఇటీవలే వార్తలు వచ్చాయి. అంతలోనే ఆయన గురించి ఇలాంటి చేదువార్త వినాల్సి ఉంటుందని.. సినీ అభిమానులు కచ్చితంగా ఊహించి ఉండరు. 

Trending News