ఆ స్టార్ హీరో నన్ను బూతులు తిట్టి.. వంటగదిలోకి పంపించాడు: రామ్ గోపాల్ వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Updated: Oct 11, 2018, 08:34 PM IST
ఆ స్టార్ హీరో నన్ను బూతులు తిట్టి.. వంటగదిలోకి పంపించాడు: రామ్ గోపాల్ వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే హీరోయిన్ తనుశ్రీదత్తా, బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పై విమర్శలు చేస్తూ.. ఆయన గతంలో తనతో అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించారని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నానా పటేకర్‌ను సమర్థిస్తూ ఆర్జీవీ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నానా పటేకర్‌తో తనకున్న అనుబంధం గురించి తెలిపారు. ఈ సమాజంలో ఏదైనా తప్పు జరిగితే అందరికీ ప్రశ్నించే హక్కు ఉందని.. తనుశ్రీ కూడా ఆ హక్కును తప్పకుండా ఉపయోగించుకోవచ్చని ఆయన అన్నారు.

తమకు ఇబ్బంది కలిగించే రీతిలో ఎవరైనా ప్రవర్తిస్తే.. వారిని ఎదిరించి పోరాడేందుకు కూడా ఎవరికైనా హక్కు ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో తాను తనుశ్రీని తప్పుపట్టడం లేదని చెప్పారు. కానీ నానా పటేకర్‌ను మాత్రం ఎటువంటి తప్పూ చేయని వ్యక్తిగా తాను భావిస్తానని ఆర్జీవీ అన్నారు. ఒకవేళ తనుశ్రీ విషయంలో నానా ప్రవర్తన ఏదైనా తప్పుడు విధంగా ఉన్నట్లయితే.. అది నానా కావాలని చేసిన తప్పు కూడా కాకపోవచ్చని ఆర్జీవి అభిప్రాయపడ్డారు. 

ఈ క్రమంలో నానా పటేకర్ గురించి కొన్ని విషయాలు ఆర్జీవి చెప్పారు. ఆయన దర్శకులతో చాలా చనువుగా ఉంటారని.. ఆయన మనసు కల్మషం లేనిదని తెలిపారు. తనకు కనీసం ఛాయ్ పెట్టడం కూడా రాదని తాను నానాతో అన్నప్పుడు ఆయన భరించలేని బూతులు తిట్టి.. వంటగదిలో పంపించి టీ పెట్టడం నేర్పించారని ఆర్జీవి అన్నాడు. సివిక్ సెన్స్ ఉన్న నటుల్లో నానా కూడా ఒకరని.. బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా రోడ్డు మీద మూత్ర విసర్జన చేయడం గానీ.. చెత్త పడేయడం గానీ చేస్తే ఆయనకు విపరీతమైన కోపం వచ్చేదని.. వారిని పిలిచి నానా తిట్టేవారని ఆర్జీవి తెలిపారు. అలాగే నానాకి దానగుణం ఎక్కువని.. తాను తీసుకొనే పారితోషికంలో సగం మొత్తం ఆయన దాన ధర్మాలకు వినియోగిస్తారని.. కానీ ఆ దానాలను తన పేరు మీద కాకుండా నిర్మాతల పేరు మీద చేస్తారని ఆర్జీవి తెలియజేశారు.