"సైరా" సినిమా వారి ఆవేదనను తీరుస్తుందా..?

రాయలసీమకు చెందిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను "సైరా" పేరుతో నిర్మాత రామ్ చరణ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Last Updated : Aug 5, 2018, 02:02 PM IST
"సైరా" సినిమా వారి ఆవేదనను తీరుస్తుందా..?

రాయలసీమకు చెందిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను "సైరా" పేరుతో నిర్మాత రామ్ చరణ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించే ఈ సినిమాకి సంబంధించి ఈ మధ్యకాలంలో ఓ ఆసక్తికరమైన చర్చ జరిగింది. పలు టీవీ ఛానళ్లలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు తమ భావాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. తమ పూర్వీకుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం మీద సినిమా తీస్తున్నా తమకు కనీస గౌరవం, గుర్తింపు దొరకడం లేదని వారు వాపోయారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదనను వ్యక్తం చేశారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ ఈ విషయంలో కాస్త చొరవ చూపించారని వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులను సంప్రదించారని.. సినిమాకి సంబంధించిన ప్రతీ కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా నిర్మాతల నుండి ఎలాంటి వార్త కూడా రాలేదు. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించారు. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి.  క్రీ.శ.1800లో అంగ్లేయులు నొస్సం సంస్థానమును స్వాధీనము చేసుకొని.. నరసింహారెడ్డి వంశానికి నెలకు 11 రూపాయలు భరణము ఏర్పాటు చేశారు. 1846 జూలై 10వ తేదీన నరసింహారెడ్డి రెడ్డి 500 మంది సైనికుల సహాయంతో, కోయిలకుంట్ల పట్టణముపై దండెత్తి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశాడు.

ఆ తర్వాత నరసింహారెడ్డిని కట్టడి చేసేందుకు కెప్టెన్ వాట్సన్ అనే ఆంగ్లేయ అధికారి కర్నూలు రావడం జరిగింది. వాట్సన్ సైన్యంతో సహా గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, ఓ అర్ధరాత్రి నరసింహారెడ్డి వచ్చి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. కానీ ఆ తర్వాత ఒక వ్యూహంతో నరసింహారెడ్డిని కోయిలకుంట్ల ప్రాంతంలోనే ఆంగ్లేయులు బంధించారు. 1847 ఫిబ్రవరి 22 తేదిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో 
ఉరితీశారు. 

Trending News