తెలుగులో తప్పక చూడాల్సిన టాప్ టెన్ బాలల చిత్రాలివే

"నేటి బాలలే రేపటి పౌరులు" అనేది జగమెరిగిన సామెత. అవును.. మనం బాలలకు చిన్నప్పటి నుండీ మంచి నడవడికను అలవర్చుకొనేలా చేయగలిగితే.. నిజంగా వారు దేశం గర్వించదగ్గ మంచి బాధ్యతాయుతమైన పౌరులుగా మారే అవకాశం ఉంది.

Last Updated : Jul 9, 2018, 05:47 PM IST
తెలుగులో తప్పక చూడాల్సిన టాప్ టెన్ బాలల చిత్రాలివే

"నేటి బాలలే రేపటి పౌరులు" అనేది జగమెరిగిన సామెత. అవును.. మనం బాలలకు చిన్నప్పటి నుండీ మంచి నడవడికను అలవర్చుకొనేలా చేయగలిగితే.. నిజంగా వారు దేశం గర్వించదగ్గ మంచి బాధ్యతాయుతమైన పౌరులుగా మారే అవకాశం ఉంది. నేటి బాలలను ఎక్కువగా ప్రభావితం చేసే మాధ్యమం "సినిమా". సినిమాలో చూపించే ప్రతీ అంశము కూడా బాలల జీవితంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగా ప్రభావం చూపిస్తుంది. అందుకే మంచిని, నీతిని, ఆలోచన శక్తిని పెంపొందించే చిత్రాలను బాలలకు చూపించడం అనేది ఎంతో అవసరం. ఈ క్రమంలో తెలుగు సినిమాల్లో నేటి పిల్లలు తప్పకుండా చూడాల్సిన టాప్ టెన్ బాలల చిత్రాల వివరాలు మీకోసం..!

బాలరాజు కథ - 1970లో విడుదలైన ఈ సినిమాకి బాపు దర్శకత్వం వహించారు. మహాబలిపురానికి వచ్చే యాత్రికులకు గైడ్‌గా వ్యవహరించే బాలరాజు అనే ఓ చిన్న కుర్రాడి కథ ఇది. ఈ సినిమాలో మాస్టర్ ప్రభాకర్ బాలరాజు పాత్రలో ఒదిగిపోయి నటించారని చెప్పాలి. ముళ్లపూడి వెంకటరమణ ఈ చిత్రానికి కథను అందించారు. ప్రముఖ చలన చిత్ర విమర్శకుడు వాశిరాజు ప్రకాశం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. బాలలలో ఆత్మస్థైర్యాన్ని, పట్టుదలను పెంచే చిత్రం "బాలరాజు కథ"అనడంలో సందేహం లేదు. 

పాపం పసివాడు - విదేశీ చిత్రం "లాస్ట్ ఇన్ ది డెజర్ట్" సినిమా ఆధారంగా తెలుగులో దర్శకుడు వి.రామచంద్రరావు తెరకెక్కించిన చిత్రం "పాపం పసివాడు". ఓ బాలుడు ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిపోవడంతో.. తాను ఓ నిర్మానుష్యమైన ఎడారి ప్రాంతంలో చిక్కుకుపోతాడు. ఈ క్రమంలో ఎన్నో అగచాట్లను పడతాడు. కానీ.. ఎన్ని సమస్యలొచ్చినా వాటన్నింటినీ అధిగమించి ఆ బాలుడు ఎలా తన తల్లిదండ్రులను చేరాడన్నదే చిత్రకథ. మాస్టర్ రామరాఘవన్ ఈ చిత్రంలో బాలుడి పాత్రను పోషించాడు. తెలుగు సినిమాలో రికార్డుస్థాయి కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం బాలలు తప్పకుండా చూడాల్సిన సినిమా. 

బాల భారతం - మహాభారతంలో కౌరవ పాండవుల చిన్ననాటి సంగతులకు కథారూపం ఇచ్చిన చిత్రం "బాల భారతం". ఈ చిత్రంలో నటించే సమయంలో అందాల తార శ్రీదేవికి కేవలం తొమ్మిదేళ్లు మాత్రమే. కౌరవుల సోదరి దుస్సల పాత్రలో నటించిందామె. ఈ చిత్రంలో దుర్యోధనుడిగా నటించిన మాస్టర్ ప్రభాకర్ "బాలరాజు కథ"లో కూడా నటించడం గమనార్హం. మహాభారతాన్ని పిల్లలకు పూసగుచ్చిన్నట్లు తెలియజేయాలంటే ఈ చిత్రాన్ని చూపించాల్సిందే. కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1972లోవిడుదలైంది.

భద్రం కొడకో - 1992లో అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాల కార్మికుల వెతలను సెల్యూలాయిడ్ పై వినూత్నంగా ఆవిష్కరించే ప్రయత్నం చేయడం గమనార్హం. వీధి బాలల సమస్యల పరిష్కారం కోసం చేసిన అతిగొప్ప ప్రయోగంగా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. 

లిటిల్ సోల్జర్స్ - గంగరాజు గుణ్ణం దర్శకత్వంలో 1996లో విడుదలైన చిత్రం "లిటిల్ సోల్జర్స్". తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు అన్నా చెల్లెళ్ళకు వారి తాతయ్య ధైర్యాన్ని  నూరిపోయడం కోసం సాహస క్రీడల్లో ఎలా శిక్షణ ఇస్తాడన్నది ఈ సినిమా కథాంశం. ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందిన ఈ చిత్రంలో నటించిన బేబీ కావ్యకు ఉత్తమ బాలనటిగా జాతీయ పురస్కారం కూడా రావడం గమనార్హం. పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే చిత్రంగా మనం "లిటిల్ సోల్జర్స్" చిత్రాన్ని చెప్పుకోవచ్చు. 

బొమ్మలాట - 2004లో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో గంగరాజు గుణ్ణం, రానా దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కథ ఓ పేద కుర్రాడిది. ఏ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ ట్యాగ్ లైన్‌తో పప్పెట్ షో కాన్సెప్ట్‌తో తెరకెక్కిన తొలిచిత్రం కూడా ఇదే. ఈ చిత్రంలో నటించిన బాలనటుడు సాయి కుమార్‌కి జాతీయ అవార్డు లభించింది. 

మిణుగురులు - అయోధ్య కుమార్ దర్శకత్వంలో 2012లో విడుదలైన చిత్రం "మిణుగురులు". రెసిడెన్షియల్ అంధ పాఠశాలలో చదువుకుంటున్న అంధ విద్యార్థులు వార్డెన్‌ చేత హింసకు గురవుతై ఎన్నో బాధలు పడుతుంటారు. అలాంటి సమయంలో రాజు అనే కుర్రాడు ఆ విషయాలను జిల్లా కలెక్టరు దృష్టికి ఎలా తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాడన్నదే చిత్రకథ. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకున్న ఈ చిత్రం పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శనకు నోచుకుంది. పిల్లలో గొప్ప ఆలోచనాశక్తిని పెంచే ఈ చిత్రాన్ని తప్పకుండా ప్రతీ ఒక్కరూ చూడాల్సిందే.

ఎగిసే తారాజువ్వలు - బాలలకు సైన్స్ విద్య అనేది ఎంత ముఖ్యమో తెలియజేసిన చిత్రమిది. పిల్లలకు విద్యను బోధించే పద్ధతులలో మార్పులు అనివార్యమని తెలియజేస్తూ.. తల్లిదండ్రులకు ఓ సందేశం ఇవ్వడానికి ప్రయత్నం చేసిన ఈ చిత్రానికి కత్తి మహేష్ దర్శకత్వం వహించారు. 

 

రామాయణం - దర్శకుడు గుణశేఖర్ చిన్నారి బాలలతో రామాయణ గాథను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ తీసిన చిత్రమే "బాల రామాయణం". 10 ఏళ్ల వయసులో జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటించడం విశేషం. ఎం ఎస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శబ్దాలయ థియేటర్స్ బ్యానరుపై ప్రొడ్యూస్ చేశారు.  

గోల్కొండ హై స్కూలు - పాఠశాలలన్నీ యాంత్రికంగా నడుస్తోన్న ఈ రోజుల్లో.. విద్యాలయాల్లో క్రీడలకు పెద్ద పీట వేయాలని చెప్పిన చిత్రం "గోల్కొండ హైస్కూలు". ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వం వహించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కూడా బాగానే సక్సెస్ అయ్యింది. 

Trending News