10 సెకన్లలో మలేరియాని గుర్తించేస్తారు..!

    

Updated: Oct 19, 2017, 06:46 PM IST
10 సెకన్లలో మలేరియాని గుర్తించేస్తారు..!

కోల్‌కతాకి చెందిన కొందరు యువ పరిశోధకులు ఒక వినూత్న పద్ధతిని కనిపెట్టారు. కేవలం 10 సెకన్లలోనే మలేరియా క్రిములను గుర్తించే చౌకైన పేపర్ మైక్రోస్కోప్‌ సహాయంతో.. ఎప్పటికప్పడు రక్తపు నమూనాల చిత్రాల డేటాని సేకరించి, ఆయా ప్రాంతంలో మలేరియా బారిని పడినవారు ఎంత శాతం ఉన్నారో తెలియజేసే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.  సెంట్యౌర్ అని ఈ పద్ధతికి పేరు పెట్టారు. 

ఈ పద్ధతిలో తొలుత ఫోల్డ్ స్కోప్ అనే పరికరాన్ని  మొబైల్ ఫోన్‌లో అమర్చి, కెమెరాతో అనుసంధానం చేస్తారు. అలా అనుసంధానం చేశాక, పేషెంట్ల రక్తపు శాంపిల్స్‌ను మొబైల్ ద్వారా క్లిక్ చేస్తారు. ఈ మైక్రోస్కోప్ ఆ శాంపిల్స్‌ను మాగ్నిఫై చేసి చిత్రాలుగా మారుస్తుంది.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన నిలంజన్ దావ్, దేవప్రియ పాల్, నిలంజనా దత్తా లాయ్‌తో పాటు షిబ్పూర్ ఐఐఈఎస్‌టికి చెందిన అరిందమ్ బిశ్వాస్ ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. 

వేగంగా మలేరియా క్రిములను గుర్తించి, రిమోట్ ప్రాంతాల్లో  వైద్య సౌకర్యం అందించడానికి ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బ్లడ్ శాంపిల్స్‌ను మొబైల్ కెమెరాతో ఫోటోలు తీసి మాగ్నిఫై చేసే సమయంలో.. అదే మొబైల్‌తో అనుసంధానమైన ఫోల్డ్ స్కోప్ ప్రయోగానికి అనువైన రీతిలో చిత్రాలను కాప్చర్ చేస్తుంది. ఆ చిత్రాన్ని ఒక యాప్ ద్వారా లేదా ఇంటర్నెట్ సర్వర్ ద్వారా ఇనిస్టిట్యూట్‌కు పంపించవచ్చు.

శాంపిల్ చిత్రాన్ని పొందిన ఇనిస్టిట్యూట్ పరిశోధకులు, కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆ రక్తం శాంపిల్‌లో మలేరియా క్రిములు ఉన్నాయా లేవా? అన్న విషయాన్ని పసిగడతారు. ఇక  ఫోల్డ్‌స్కోప్ అనే మినీ మైక్రోస్కోప్ విషయానికి వస్తే, దానిని స్టాన్‌ఫోర్డు యూనివర్సిటీ ప్రొఫెసరైన మను ప్రకాష్ కనిపెట్టారు. దానికి వన్ డాలర్ మైక్రోస్కోప్ అని మరోపేరు కూడా ఉంది.