మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో కాళ్లు మోపారు. 

Last Updated : Sep 1, 2018, 11:41 PM IST
మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో కాళ్లు మోపారు. కర్నూలులోని మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన అమిత్ షా.. అంతకు ముందే అదే ప్రాంతంలో జరుగుతున్న ఆరెస్సెస్‌ జాతీయ స్థాయి సమన్వయ సమావేశంలో కూడా పాలుపంచుకున్నారు. మంత్రాలయంలోని రాఘవేంద్రుని ఆలయానికి వచ్చిన అమిత్ షాని మఠాధిపతులు, ఆలయ సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల వారి ఆశీర్వచనాలు కూడా ఈ సందర్భంగా అమిత్ షా తీసుకున్నారు.

ఈ క్రమంలో మంత్రాలయంలోని ఆరోగ్యశాలను కూడా ఆయన ప్రారంభించారు. గోశాలతో పాటు ఆలయంలోని మిగతా విభాగాలను కూడా అమిత్ షా పరిశీలించారు. దేవాలయాలు సామాజిక కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆ తర్వాత ఆలయ తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అమిత్ షా... తిరిగి సమావేశాలకు వెళ్లిపోయారు. అమిత్ షా మంత్రాలయంలో పర్యటనకు వస్తున్న క్రమంలో భాగంగా మందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసులకు వచ్చిన ఆదేశాల మీదట.. ఆ ప్రాంతంలో కొందరు టీడీపీ నాయకులను హౌస్ అరెస్టు చేశారు.

గత రెండు రోజులుగా మంత్రాలయంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ నేతృత్వంలో ఈ నెల రెండో తేదీ వరకు మూడు రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ సమావేశాలకు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ 36 సంఘ్‌ పరివార్‌లకు చెందిన 54 శాఖల రాష్ట్ర స్థాయి ముఖ్య ప్రచారక్‌లు, ప్రతినిధులు 202 మంది హాజరయ్యారని వినికిడి. 

Trending News