జయలలిత మృతి కేసులో అపోలో ఆస్పత్రి అధినేత సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెంది ఏడాది దాటిన తర్వాత వెలుగులోకొచ్చిన మరో ఆసక్తికరమైన అంశం. 

Last Updated : Mar 23, 2018, 02:13 PM IST
జయలలిత మృతి కేసులో అపోలో ఆస్పత్రి అధినేత సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెంది ఏడాది దాటిన తర్వాత ఆమె చికిత్స కాలంలో ఆస్పత్రిలో నెలకొన్న పలు పరిస్థితులపై అపోలో హాస్పిటల్స్ గ్రూప్స్ చైర్మన్ డా. ప్రతాప్ సి రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలితకు చికిత్స అందించినంత కాలం అక్కడి సీసీటీవీ కెమెరాలు స్విచాఫ్ చేసి వున్నాయని డా. ప్రతాప్ సి రెడ్డి స్పష్టంచేశారు. జయలలితను ఆస్పత్రిలో చేర్పించిన వెంటనే ఆమె చికిత్స పొందుతున్న ఐసీయులో మిగతా పేషెంట్స్‌ను అందరినీ మరో ఐసీయులోకి తరలించి అక్కడ ఆమెకు మాత్రమే చికిత్స అందించినట్టు డా. ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. 24 పడకల సౌకర్యం కలిగి వున్న ఆ ఐసీయులో ఆమె ఒక్కరికి మాత్రమే చికిత్స అందించామని, అక్కడికి ఇంకెవ్వరూ వెళ్లే అవకాశం లేకుండా అధికారిక యంత్రాంగం గట్టి భద్రతా చర్యలు తీసుకున్నట్టు డా. ప్రతాప్ సి రెడ్డి తేల్చిచెప్పారు. చెన్నైలో గురువారం జరిగిన ఓ మెడికల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ డా. ప్రతాప్ సి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే జయలలిత మృతి కేసులో దర్యాప్తు బృందాలకు అపోలో ఆస్పత్రి వర్గాలు అనేక సమాచారం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, జయలలితకు చికిత్స అందించినంత కాలానికి సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలను కూడా ఆస్పత్రి వర్గాలు దర్యాప్తు బృందాలకు సమర్పించాయా అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు స్పందించిన డా. ప్రతాప్ సి రెడ్డి ఒకింత ఆవేదన వ్యక్తంచేశారు. 

" దురదృష్టంకొద్దీ జయలలితకు చికిత్స అందించిన ఆ 75 రోజులపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలను వాళ్లు స్విచాఫ్ చేసి వుంచారని, ఆమెను ప్రతీ ఒక్కరు చూడటానికి వాళ్లు ఇష్టపడలేదు " అని తెలిపారు. " జయలలితను బతికించేందుకు తాము శాయశక్తులా కృషిచేశామని, అయినప్పటికీ దురదృష్టంకొద్ది భరించలేని గుండెనొప్పి కారణంగా ఆమె మృతిచెందారు " అని డా. ప్రతాప్ సి రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. 

Trending News