నేడు సభ ముందుకు తెదేపా, వైసీపీ అవిశ్వాస నోటీసులు.. చర్చపై ఉత్కంఠ!

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు పెట్టిన అవిశ్వాస నోటీసులు సోమవారం లోక్‌సభ ముందుకు రానున్నాయి.

Last Updated : Mar 19, 2018, 11:34 AM IST
నేడు సభ ముందుకు తెదేపా, వైసీపీ అవిశ్వాస నోటీసులు.. చర్చపై ఉత్కంఠ!

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు పెట్టిన అవిశ్వాస నోటీసులు సోమవారం లోక్‌సభ ముందుకు రానున్నాయి. అయితే తీర్మానానికి సంబంధించిగానీ, చర్చకు సంబంధించిగానీ ఇప్పటివరకూ లోక్‌సభ వర్గాల నుండి స్పష్టమైన సంకేతాలు వెలువడలేదు.

గతవారం నోటీసులు తీసుకోకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సోమవారం సవరించిన బిజినెస్ లిస్టులో తమ నోటీసును ఉంచాలని లోక్‌సభ సచివాలయానికి లేఖ రాశారు. తెదేపా కూడా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది.

టీఆర్ఎస్, ఏఐఏడీఎంకేలు లోక్‌సభ సమావేశాలకు సహకరిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై మద్దతు ఇచ్చే విషయంలో ఇరుపార్టీల నుంచి ఇంకా స్పష్టత సంకేతాలు రాలేదు. నివేదికల ప్రకారం, ఏఐఏడీఎంకే బీజేపీకే మద్దతు ప్రకటిస్తుందని అనధికారికంగా వెల్లడించింది.

మొదటి రెండు వారాల మలి విడత బడ్జెట్ సమావేశాలను ఒకసారి పరిశీలిస్తే.. మోదీ ప్రభుత్వం పలు కీలక బిల్లులతో పాటు బడ్జెట్ బిల్లును చర్చ లేకుండానే మూజవాణి ఓటుతో ఆమోదించింది.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించకపోవడంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గతవారంలో అవిశ్వాస తీర్మానానికి సంబధించిన నోటీసును మొదట ఇచ్చింది. ఆతరువాత ఏపీకి బడ్జెట్ లో అన్యాయం జరిగిందని టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి నుండి వైదొలిగి అవిశ్వాస నోటీసును అందించింది. మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో లోక్‌సభలో ఎదుర్కొనబోతున్న మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం ఇదే.

తాము ప్రవేశపెట్టబోయే నోటీసులకు విపక్షాలు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇరుపార్టీలు లాబియింగ్ లు జరిపారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీలు మద్దతు ఉండాలి.  

ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా.. తమ సభ్యుల బలం ముందు ఆ తీర్మానం వీగిపోతుందని ప్రభుత్వం ధీమాగా ఉంది.

ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న సభ్యుల సంఖ్య 539. సభలో బీజేపీకి 274 మంది సభ్యులు ఉన్నారు. దీంతో సొంతంగానే ఆ పార్టీ  మెజార్టీ మార్క్ 270ని దాటేసింది. ఇదీగాక ఎన్దీఏ కూటమిలో వివిధ పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి. బీజేపీతో విభేదించి కూటమి నుంచి 16 మంది సభ్యులున్న టీడీపీ వైదొలగడంతో, ఎన్దీఏ కూటమి బలం తగ్గింది.

ఎన్దీఏ 2014లో 336 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అందులో బీజేపీ సొంతంగానే 282 సీట్లు సాధించింది. అయితే,  ఉపఎన్నికల్లో కాషాయ పార్టీ ఓడిపోవడంతో బలం 274 స్థానాలకి పడిపోయింది. అధికారంలో ఉన్న ఎన్దీఏ ప్రభుత్వంలో 11 మిత్రపక్ష పార్టీలు ఉన్నాయి. దీంతో సభ్యుల ఎన్డీఏ కూటమి సభ్యుల సంఖ్య 314. టీడీపీ మరోసారి కూటమిలోకి రావాలని కోరుకుంటే.. సభ్యుల సంఖ్య 330 అవుతుంది.

Trending News