Coronavirus: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ ఆరు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు

Coronavirus Cases In India: ప్రశాంతంగా గడుపుతున్న ప్రజా జీవనంపై పంజా విసిరేందుకు కరోనా మహమ్మారి సిద్ధమవుతోంది. ఏ మాత్రం అలసత్వం వహించినా.. మళ్లీ కష్టాలు ఎదుర్కొవాల్సిందే. ఆరు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండగా.. కేంద్రం హెచ్చరిస్తూ లేఖ రాసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2023, 11:38 AM IST
Coronavirus: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ ఆరు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు

Coronavirus Cases In India: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా పంజా విసురుతున్న సమయంలోనే కోవిడ్ మహమ్మారి కూడా ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు రెడీ అవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న క‌రోనా కేసుల పెరుగుతుండడంతో ప్ర‌జ‌ల్లో మ‌రోసారి భయాందోళన‌లు మొదలవుతున్నాయి. నాలుగు నెలల తర్వాత ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగడంతోపాటు హెచ్‌3ఎన్2 వైరస్ రోగుల సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో సూక్ష్మ స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని 6 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గురువారం దేశవ్యాప్తంగా 754 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,623కి చేరుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. నిరంతర పర్యవేక్షణ, నివారణ చర్యలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది. 

మహారాష్ట్రలో గత వారంలో ఇన్ఫెక్షన్ కేసులు 355 నుంచి 668కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. గుజరాత్‌లో కోవిడ్-19 కేసులు 105 నుంచి 279కి, తెలంగాణలో 132 నుంచి 267కి, తమిళనాడులో 170 నుంచి 258కి, కేరళలో 434 నుంచి 579కి పెరిగాయన్నారు. కర్ణాటకలో కూడా కేసుల సంఖ్య 493 నుంచి 604కి చేరింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్ష, చికిత్స, ట్రాక్, కోవిడ్ తగిన ప్రవర్తన, టీకా వ్యూహాన్ని అనుసరించాలని భూషణ్ సూచించారు.

దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చే చాలా విమానాలు మహారాష్ట్రలోనే ల్యాండ్ అవుతుండడం కేసుల పెరుగుదలకు కారణమైంది. అదేవిధంగా కరోనా కొత్త రూపాన్ని వ్యాప్తి చేయడంలో మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

కరోనా కేసులు పెరుగుతున్న ఆరు రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం.. ఒకరి నుంచి మరొకరికి సోకకుడా జాగ్రత్తలు పాటించాని సూచించింది. కరోనా నివారించడానికి రిస్క్ అసెస్‌మెంట్-ఆధారిత విధానాన్ని అవలంబించాలని పేర్కొంది. ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ -19, ఇన్‌ఫ్లుయెంజా వంటి వ్యాధులకు సంబంధించిన కేసులపై నిఘా ఉంచాలని ఆదేశించింది.

కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోవడంలో భారత్ ముందంజలో ఉంది. కరోనా కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 5,30,790గా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,41,57,297 మంది కరోనాను జయించారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉండగా.. 98.80 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు తెర.. డీఏ పెంపుపై నేడే ప్రకటన  

Also Read: Loan Costly: కస్టమర్లకు షాకిచ్చిన మరో బ్యాంక్.. ఈఎంఐలపై భారీ మోత

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News