ముంబైని వదలని వర్షం: సేవలు నిలిపివేసిన డబ్బావాలాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి.

Last Updated : Jul 10, 2018, 10:25 AM IST
ముంబైని వదలని వర్షం: సేవలు నిలిపివేసిన డబ్బావాలాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండ‌పోత వ‌ర్షాల‌తో పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. ర‌హ‌దారులు చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రైల్వే ట్రాక్ లపై నీరు నిలిచిపోవడంతో సబర్బన్ రైళ్ల కాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు ప్రాంతాలలో రోడ్లమై నడుం లోతు నీరు నిలిచింది. దీంతో నేడుకూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నగరంలో డబ్బావాలాలు ఈ రోజు తమ సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.

 

 

 

భారీవర్షాల నేపధ్యంలో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. రోడ్లపై నిలిచిన నీళ్లను మోటార్ల సాయంతో తొలగించే పనిలో పడ్డారు. అయితే ఎంత నీళ్లు తొలగించినా.. వర్షం కురుస్తూనే ఉండటం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. మరోవైపు రాగల 24 గంటల్లో ముంబైలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

అటు హైదరాబాద్ లో నేడూ, రేపూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గడ్, ఒడిశాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Trending News