ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి షాక్ ఇచ్చిన ఢిల్లీ హై కోర్ట్

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ హై కోర్టు షాక్

Last Updated : Jun 18, 2018, 02:10 PM IST
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి షాక్ ఇచ్చిన ఢిల్లీ హై కోర్ట్

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆఫీస్ ఎదుట అరవింద్ కేజ్రీవాల్ ధర్నా చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన హై కోర్ట్... మీరు చేస్తోంది ధర్నా ఎలా అవుద్ది అని సూటిగా ప్రశ్నించింది. అసలు అక్కడ ధర్నా చేయడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారని ఈ సందర్భంగా కోర్టు అరవింద్ కేజ్రీవాల్‌ని నిలదీసింది. ఒకరి ఇంట్లోకి కానీ లేదా కార్యాలయంలోకి కానీ ఇలా చొచ్చుకువెళ్లి ధర్నా చేయకూడదని అభిప్రాయపడిన కోర్టు... అది అసలు ధర్నా అనిపించుకోదు అని స్పష్టంచేసింది. నేటి సోమవారంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయం ఎదుట అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నా 8వ రోజుకు చేరడంతో ముఖ్యమంత్రిని ధర్నా విరమించుకునేలా ఆదేశాలివ్వాల్సిందిగా కోరుతూ ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఢిల్లీ హై కోర్టుని విజ్ఞప్తి చేశారు. విజేందర్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఢిల్లీ హై కోర్టు సోమవారం ఉదయం ఈ వ్యాఖ్యలు చేసింది.

గత సోమవారం నాడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కేబినెట్ మంత్రులు సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్‌లతో కలిసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అప్పటినుంచే అక్కడ ధర్నాకు కూర్చున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కోసం పనిచేస్తోన్న ఐఏఎస్ అధికారులు తమ నిరసన విరమించుకుని విధుల్లో చేరేవిధంగా గవర్నర్ ఆదేశాలు ఇవ్వాలనే డిమాండ్‌తో కేజ్రీవాల్ ఈ ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. 

Trending News