రాజస్థాన్‌, యుపీలలో ఇసుక తుఫాన్ బీభత్సం: 67 మంది మృతి

రాజస్థాన్‌, యుపీలలో ఇసుక తుఫాన్ భీభత్సం సృష్టించింది.

Last Updated : May 3, 2018, 06:56 PM IST
రాజస్థాన్‌, యుపీలలో ఇసుక తుఫాన్ బీభత్సం: 67 మంది మృతి

న్యూఢిల్లీ: రాజస్థాన్‌, యుపీలలో ఇసుక తుఫాన్ భీభత్సం సృష్టించింది. పలు చోట్ల బుధవారం అర్థరాత్రి ఇసుక తుఫాన్‌ కారణంగా ఉత్తరప్రదేశ్ లో 41, రాజస్థాన్‌లో 27 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ఇసుక తుఫాన్‌ భీభత్సంలో ఈ రెండు రాష్ట్రాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలోనే 12 మంది మృతి చెందారు. ఢిల్లీలోనూ బుధవారం గాలి దుమారం చెలరేగింది. గాలి దుమారం కారణంగా 15 విమానాలను దారి మళ్లించారు. యూపీలోని ఆగ్రాలో ఓ విద్యాసంస్థ గోడకూలి 23 మంది మృత్యువాత పడ్డారు. సహారన్పూర్‌లో చెట్టు కూలడంతో 8 ఏళ్ల బాలిక చనిపోయింది. యూపీ సీఎం ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించి ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తక్షణ సహాయం, సేవలు, సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

 

రాజస్థాన్ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... ధోల్‌పూర్ (10)‌, అల్వార్(5)‌, ఝన్‌ఝున్‌, బికనేర్‌ ప్రాంతాల్లో ప్రజలు మృత్యువాత పడ్డారు. కరౌలీలోని ఓ భవనం గోడ కూలి ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పలు చోట్ల పెద్ద వృక్షాలు నేల కూలడంతో వందమందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నట్లు స్థానిక ఎస్పీ తెలిపారు.

బుధవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం, పిడుగుల కారణంగా 1,000 పైగా విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. దీంతో పలు చోట్ల చీకటి అలముకొంది. మరమ్మతు పనులు చేపట్టడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు, ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించింది.

 

Trending News