ఆర్‌ఎస్‌‌ఎస్ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ కురువృద్ధుడు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్‌ఎస్‌ఎస్) తమ వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం కోసం ప్రతీ సంవత్సరం ఒక అతి పెద్ద సమావేశాన్ని నిర్వహిస్తుంది.

Last Updated : May 28, 2018, 08:01 PM IST
ఆర్‌ఎస్‌‌ఎస్ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ కురువృద్ధుడు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్‌ఎస్‌ఎస్) తమ వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం కోసం ప్రతీ సంవత్సరం ఒక అతి పెద్ద సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈసారి కూడా అలాగే నిర్వహించే ఆ సమావేశానికి కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

జూన్ 7వ తేదిన నాగపూర్‌లో జరిగే ఈ సమావేశంలో దేశం నలుమూలల నుండీ వచ్చే ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌లు పాల్గొంటారు. బీజేపీ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహిస్తున్న అనేక మంది నాయకులు ఒకప్పుడు ఆర్‌ఎస్ఎస్ వాలంటీర్లుగా వ్యవహరించిన వారే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పలుమార్లు ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గొప్ప నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ అతి పెద్ద ఆర్‌ఎస్‌‌ఎస్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని వార్తలు రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఈ సమావేశాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ దగ్గరుండి జరిపిస్తారని.. ఇదే సమావేశంలో పలు అంశాలపై చర్చలు కూడా ఉంటాయని సమాచారం. గతంలో ప్రణబ్ ముఖర్జీ కూడా పలుమార్లు మోహన్ భగవత్‌ని రాష్ట్రపతి భవన్‌కి గౌరవపూర్వకంగా ఆహ్వానించారు. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ ఆర్‌ఎస్‌‌ఎస్ సమావేశానికి హాజరవుతున్న క్రమంలో పలువురు ఆర్‌ఎస్‌‌ఎస్ నేతలు ఆయనను నయా సర్దార్ పటేల్‌గా పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఆర్‌ఎస్‌ఎస్ సమావేశానికి రావడానికి సుముఖత చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఈ సమావేశానికి వచ్చి మాట్లాడితే.. దేశంలో పలు సంఘాల మధ్య ఉండే శత్రుత్వాలు దూరమై  స్నేహపూర్వకమైన వాతావరణం పెరుగుతుందని తాము భావిస్తున్నామని ఆర్‌ఎస్‌ఎస్ నేత రాకేష్ సిన్హా తెలిపారు.

Trending News