తాజ్ కృష్ణలో కాంగ్రెస్-జేడీఎస్ నేతలతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

తాజ్ కృష్ణ హోటల్‌కి చేరుకున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Last Updated : May 18, 2018, 08:50 PM IST
తాజ్ కృష్ణలో కాంగ్రెస్-జేడీఎస్ నేతలతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

కర్ణాటకలో బల నిరూపణకు ముందే తమ ఎమ్మెల్యేలను చేజారిపోనివ్వకూడదు అనే ముందస్తు జాగ్రత్తతో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌కి తరలించడంతో కర్ణాటక క్యాంప్ రాజకీయాలు కాస్తా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో బస చేసిన కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు కలిసి బేరసారాలు జరిపే ప్రమాదం వుందనే అనుమానంతో ఆ కూటమి అగ్రనేతల విజ్ఞప్తి మేరకు తెలంగాణ పోలీసులు హోటల్ బయట భారీ స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనికితోడు హోటల్ యాజమాన్యం సైతం తమ ప్రైవేటు సెక్యురిటీని రంగంలోకి దింపింది. దీంతో హోటల్ తాజ్ కృష్ణ వద్ద ప్రస్తుతం ఒక రకమైన సందడి వాతావరణం నెలకొంది. ఈ కూటమిలో మొత్తం 116 మంది ఎమ్మెల్యేలు వుండగా అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 78 మంది కాగా జేడీఎస్ ఎమ్మెల్యేలు 38 ఉన్నారు. 78 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 74 మంది ఇప్పటికే ఈ హోటల్‌కి చేరుకున్నట్టు సమాచారం అందుతోంది. 

 

ఇదిలావుంటే, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నేతలు హైదరాబాద్ రావడంతో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజ్ కృష్ణ హోటల్‌కి చేరుకున్నారు. కర్ణాటక బీజేపీ నేతలు తెలుగు రాష్ట్రాల్లోని స్థానిక బీజేపీ నేతల సహాయంతో హోటల్లో బస చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసే అవకాశం వున్నందున వారికి ఆ అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని హోటల్‌కి పిలిపించుకుని హోటల్లో పరిస్థితిని సమీక్షించాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. 

తాజ్ కృష్ణ హోటల్‌కి చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంకెవ్వరు కలిసే అవకాశం లేకుండా లోపలి నుంచే భద్రతను సమీక్షిస్తున్నట్టు సమాచారం. 

Trending News