కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య: పోలీసు కుటుంబాల కిడ్నాప్

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు.

Last Updated : Aug 31, 2018, 12:27 PM IST
కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య: పోలీసు కుటుంబాల కిడ్నాప్

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రానికి చెందిన పోలీసు ఉన్నతాధికారుల కుటుంబాలను టార్గెట్ చేశారు. పోలీసు కుటుంబ సభ్యులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం జమ్మూకాశ్మీర్లో కలకలం రేపుతోంది. అంతర్జాతీయ టెర్రరిస్టు సైయద్ సలాహుద్దీన్ రెండో కుమారుడు సయ్యద్‌ షకీల్‌‌ను ఎన్ఐఏ అరెస్టు చేయడంతో ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిసింది. 2011లో తన తండ్రి నుంచి అందిన డబ్బును ఉగ్రవాదులకు సమకూర్చాడని ఆధారాలు లభించడంతో శ్రీనగర్‌లో షకీల్‌ను అరెస్టు చేశారు. ఇదే కేసులో సలాహుద్దీన్‌ మరో కొడుకు షాహిద్‌ను ఎన్‌ఐఏ జూన్‌లో అరెస్టు చేసింది.

గురువారం రాత్రి దక్షిణ కశ్మీర్‌లోని పోలీసు అధికారుల నివాసాలపై ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది మంది పోలీసు కుటుంబ సభ్యులను అపహరించినట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే పోలీసు కుటుంబసభ్యులను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లడంపై ఉన్నతాధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వార్త అవాస్తవం అంటున్నారు. అయితే పోలీసు కుటుంబాల సన్నిహితులు మాత్రం కిడ్నాప్ నిజమేనని చెబుతున్నారు. షోపియాన్, కుల్గాం, అనంతనాగ్, అవంతిపోరా నుండి ఉగ్రవాదులు ఎత్తుకెళ్లినట్టు చెబుతున్నారు. భద్రతా దళాలపై ఒత్తిడి పెంచడానికి ఉగ్రవాదులు అనుసరిస్తున్న కొత్త వ్యూహంగా కొందరు దీనిని పేర్కొన్నారు. కాగా, ఉగ్రవాదులు 11 మందిని అపహరించారంటూ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్‌లో తెలిపారు.

Trending News