జమ్ము కాశ్మీర్ పాఠశాలల్లో.. రామాయణ, భగవద్గీత గ్రంథాలను పంచిపెట్టాలని సర్కారు యోచన

జమ్ము కాశ్మీర్ పాఠశాలల్లో ఉర్దూలో తర్జుమా చేసినటువంటి రామాయణ, భగవద్గీత గ్రంథాలను పంచిపెట్టాలని అక్కడి సర్కారు యోచిస్తోంది. 

Last Updated : Oct 24, 2018, 09:03 AM IST
జమ్ము కాశ్మీర్ పాఠశాలల్లో.. రామాయణ, భగవద్గీత గ్రంథాలను పంచిపెట్టాలని సర్కారు యోచన

జమ్ము కాశ్మీర్ పాఠశాలల్లో ఉర్దూలో తర్జుమా చేసినటువంటి రామాయణ, భగవద్గీత గ్రంథాలను పంచిపెట్టాలని అక్కడి సర్కారు యోచిస్తోంది. అయితే ఈ గ్రంథాల పంపిణీ పథకంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అభ్యంతరం  తెలిపారు. కేవలం హిందూ గ్రంథాలను మాత్రం పంచిపెట్టడం భావ్యం కాదని.. విద్యార్థులకు అన్ని మతాలపై కూడా అవగాహన పెంచాలని భావిస్తే.. ఇతర మత గ్రంథాలను కూడా సరఫరా చేయాలని ఆయన తెలిపారు. ఇదే విషయమై ఒమర్ అబ్దుల్లా ట్వీట్ కూడా చేశారు.

పాఠశాలలు, కాలేజీలతో పాటు ప్రభుత్వ గ్రంథాలయాలకు కూడా మత గ్రంథాలను సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తే.. అన్ని మతాలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. కేవలం హిందూ గ్రంథాలను మాత్రమే ప్రమోట్ చేస్తూ.. మిగతా మత గ్రంథాలను విస్మరిస్తే.. ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జమ్ము, కాశ్మీర్ రాష్ట్రం గవర్నర్ పాలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే గవర్నర్ సలహాదారు నిర్వహించిన సమావేశంలో ఈ తాజా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ తాజా నిర్ణయం ప్రకారం పాఠశాల, ఉన్నత విద్యాశాఖతో పాటు జిల్లా కళాశాలలు, గ్రంథాలయ శాఖలు అన్ని కూడా సర్వానంద్ ప్రేమి ఉర్దూలో అనువదించిన శ్రీమద్భగవద్గీతతో పాటు కోసూరు రామాయణం గ్రంథాలను కొనుగోలు చేసి విద్యార్థులకు పంచిపెట్టాలని సర్కారు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు కాశ్మీర్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులను అడగగా.. ఆయన మాట్లాడుతూ.. తమకు ఈ విషయమై ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచైతే ఎలాంటి సర్క్యులర్ అందలేదని తెలిపారు.

Trending News