Karnataka Polls: రేపే కర్ణాటక తీర్పు.. జేడీఎస్‌తో కాంగ్రెస్, బీజేపీ చర్చలు..!

Karnataka Elections Counting Updates: రేపు కర్ణాటక ప్రజల తీర్పు వెల్లడికానుంది. ఇప్పటికే తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేయగా.. శనివారం కౌంటింగ్ జరగనుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జేడీఎస్ కింగ్‌ మేకర్‌గా మారితే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.   

Written by - Ashok Krindinti | Last Updated : May 12, 2023, 04:15 PM IST
Karnataka Polls: రేపే కర్ణాటక తీర్పు.. జేడీఎస్‌తో కాంగ్రెస్, బీజేపీ చర్చలు..!

Karnataka Elections Counting Updates: దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. ఈ నెల 10న పోలింగ్ జరగ్గా.. 73.19 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్, బీజేపీకి పోటాపోటీగా సీట్లు వస్తాయని వెల్లడైంది. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అధికారం చేపడుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. టీవీ 9 భారత్ వర్ష్, పీపుల్స్ పల్స్, రిపబ్లిక్ టీవీ, ఏబీపీ-సీ ఓటర్, సౌత్ ఫస్ట్, పోల్ స్ట్రాట్, జీ న్యూస్ వంటి సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకుంటుందని స్పష్టం చేశాయి. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. అధికారానికి కావల్సిన మేజిక్ ఫిగర్ 113. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకు 86 నుంచి 119 స్థానాలు వస్తాయని అంచనా ఉంది. బీజేపీకు మాత్రం 78- 100 లోపే ఇచ్చాయి. జేడీఎస్‌కు 21-26 స్థానాలు వస్తాయని అన్ని సర్వేలు అంచనా వేశాయి.

ఒక వేళ గతంలో మాదిరి ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోతే జేడీఎస్ మరోసారి కింగ్‌ మేకర్ అయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఎం పదవికి కుమారస్వామికి అప్పగించడంతో కాంగ్రెస్‌తో పొత్తుకు జేడీఎస్ ఒప్పుకుంది. అయితే కాంగ్రెస్-జేడీఎస్ మైత్రి ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆపరేషన్ ఆకర్ష్‌ పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని.. అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోతే.. జేడీఎస్ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో జేడీఎస్‌తో కాంగ్రెస్, బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఇప్పటికే సింగపూర్‌లో ఉన్నారు. బుధవారం రాత్రే ఆయన సింగపూర్ వెళ్లారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి మద్దతివ్వాలనేది జేడీఎస్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. తమ పార్టీతో ఎవరితో కలిసి వెళ్లాలనేది ఇప్పటికే నిర్ణయం అయిందని.. సరైన సమయం వచ్చినప్పుడు తమ నిర్ణయాన్ని ప్రజల ముందు ప్రకటిస్తామని పార్టీ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  

అయితే జేడీఎస్ నాయకులను జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ కొట్టిపారేసింది. తాము స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం అనే ప్రశ్నే లేదని.. జేడీఎస్‌ను సంప్రదించే ప్రసక్తే లేదని బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజే స్పష్టం చేశారు. తమకు 120 సీట్లు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై చర్చల కోసం బీజేపీ, కాంగ్రెస్‌లు తమను సంప్రదించాయని జేడీఎస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి మేలు జరగాలంటే రెండు జాతీయ పార్టీలకు చెక్ పెట్టాలన్నది కర్ణాటక ప్రజల కోరిక అని తన్వీర్ అహ్మద్ అన్నారు. కర్ణాటక అభివృద్ధికి ప్రాంతీయ పార్టీలు కృషి చేయాలని కోరారు. 

Also Read: Indian Railway Facts: ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయా..? ఈ విషయాలు తెలుసుకోండి 

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News