మన ఇంజనీర్లకు ఆదర్శమూర్తి.. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య

సెప్టెంబరు 15.. ఈ రోజును మనం భారతీయ ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే దీనికీ ఓ కారణముంది.

Updated: Sep 16, 2018, 12:04 AM IST
మన ఇంజనీర్లకు ఆదర్శమూర్తి.. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య

సెప్టెంబరు 15.. ఈ రోజును మనం భారతీయ ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే దీనికీ ఓ కారణముంది. ఈ రోజు మన దేశమే గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి.  మైసూరులో గల ప్రముఖ ఆనకట్ట కృష్ణరాజసాగర్‌కు ప్రధాన ఇంజనీరుగా పనిచేసిన ఆయన.. హైదరాబాద్‌లో మూసీనది వరదల నుండి ప్రజలను రక్షించడం కోసం పథకాలను రూపొందించాడు. అలాగే  విశాఖ రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా మోక్షగుండం పాత్ర ఎంతో ఉంది. ఈ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహోన్నతమైన వ్యక్తి జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలను మనం కూడా తెలుసుకుందాం..

*మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబరు 15  తేదిన కర్ణాటకలోని ముద్దనహల్లిలో జన్మించారు. 1883లో పూనా సైన్స్‌ కాలేజీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన ఆయన మైసూరు రాజ్య దివాను ఇచ్చే ఉపకారవేతనంతో చదువుకున్నారు. చదువు పూర్తి అయ్యాక.. విశ్వేశ్వరయ్య ప్రతిభ చూసి బొంబాయి  ప్రభుత్వం నేరుగా పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా ఆయనను నియమించింది. తర్వాత ఆయన అనేక శాఖలలో పనిచేశారు. 

*ముఖ్యంగా కర్ణాటకలో కృష్ణసాగర్‌ డ్యాంతో పాటు,  భద్రావతి ఉక్కు కర్మాగారం, మైసూర్‌ సాండల్‌ సబ్బు కర్మాగారం మొదలైన వాటికి విశ్వేశ్వరయ్య నిర్మాణ బాధ్యతలనూ స్వీకరించారు. హైదరాబాద్‌లో మూసీనదికి వరదలు వచ్చినప్పుడు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లను రూపకల్పన చేసిన ఘనత కూడా  విశ్వేశ్వరయ్యదే.

*1920లో ‘భారత దేశ పునర్నిర్మాణం’, 1934లో ‘భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం’ అనే గ్రంథాలను కూడా విశ్వేశ్వరయ్య రాశారు. సుక్కూరు పట్టణానికి సింధునది నుండి నీటిని సరఫరా చేసే ప్రాజెక్టును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. ఒక ఛాలెంజ్‌లా స్వీకరించి పూర్తిచేశారు.

*హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ డ్రైనేజీ పద్ధతులకు రూప కల్పన చేసిన విశ్వేశ్వరయ్య..  ఇండియన్‌ ఇరిగేషన్‌ కమిషన్‌ సభ్యులుగా కూడా వ్యవహరించారు. వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్లతో సత్కరించాయి. 1955లో  ప్రభుత్వం భారతరత్న అవార్డును కూడా ప్రధానం చేసి విశ్వేశ్వరయ్యను ఘనంగా సన్మానించింది.

*ఇంజనీరింగ్ రంగంలో భారతదేశానికి 30 సంవత్సరాలు సేవలు అందించిన విశ్వేశ్వరయ్య..1908లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 1917లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించారు.

*1941లో 'ఆల్‌ఇండియా మాన్యుఫాక్చరర్స్‌ ఆర్గనైజేషన్‌' సంస్థకు అధ్యక్షుడుగా విశ్వేశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 1959లో రైల్వేబోర్డు చైర్మన్‌గా కూడా పనిచేసిన విశ్వేశ్వరయ్య.. బీహారు రాష్ట్రంలో గంగానదిపై రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి స్థలం నిర్ణయించి వంతెన నిర్మించారు.

*భారతదేశాన్ని వ్యవసాయకంగా సస్యశ్యామలం చేసిన ముగ్గురు ఇంజనీర్లలో అగ్రశ్రేణిలో నిలిచేవారు ముగ్గురని చెబుతూ ఉంటారు. వారిలో సర్ ఆర్థర్ కాటన్ దొరతో పాటు కేఎల్ రావ్, మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు కూడా చోటు దక్కడం విశేషం.

*1906 - 07 మధ్యకాలంలో విశ్వేశ్వరయ్యను మన ప్రభుత్వం అరేబియా దేశమైన యెమెన్‌‌కు పంపింది. అక్కడ ఆయన నీటిపారుదల, మురుగునీటి ప్రవాహ వ్యవస్థలకు పథకాలను రచించారు. అంతేకాదు.. వాటిని విజయవంతంగా అమలు చేశారు కూడా. ఆ విధంగా ఆయన ప్రపంచ ఇంజనీర్లనే మరిపించారు.

*చైనా, జపాన్, ఈజిప్ట్, కెనడా, అమెరికా, రష్యా మొదలగు దేశాలలో కూడా విశ్వేశ్వరయ్య పర్యటించి.. ఆ దేశాలలో కూడా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు.

*1915లో మైసూరు దివానుగా ఉండగా విశ్వేశ్వరయ్య ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిషు ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది. ఏప్రిల్ 14, 1962 తేదిన ఈ అపరమేధావి స్వర్గస్తులయ్యారు.