ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు; స్తంభించిన జన జీవనం..

ముంబై మహానగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Last Updated : Jul 9, 2018, 12:53 PM IST
ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు; స్తంభించిన జన జీవనం..

ముంబై మహానగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా నాలుగవ రోజైన నేడు కూడా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచి రవాణా వ్యవస్థ అస్తవ్యస్థమైంది. దాదర్, మాతుంగా సహా పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌పై చేరిన వర్షపు నీటిని మోటార్ల సాయంతో తొలగిస్తున్నారు. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబైలోని పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌ లెవెల్‌ కంటే 180 మిల్లి మీటర్ల ఎత్తులో నీరు నిలిచి ఉందని రైల్వే శాఖ పేర్కొంది. చాలా లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై మోకాలి లోతు నీరు చేరింది.

ముంబై భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బీఎంసీ పరిధిలోని అన్ని స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ప్రకటించినట్లు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు భారీ వర్షం ధాటికి ఆదివారం ఒకరు మృతి చెందగా, నలుగురు గల్లంతయ్యారు.

<

 

మహారాష్ట్రలో మరో మూడు రోజుల వరకూ వర్షాలు ఇలాగే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబైలో రానున్న 24 గంటల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ముంబై రీజియన్‌తో పాటు గోవా, దక్షిణ గుజరాత్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Trending News