రాజ్యాంగాన్ని నమ్మనివారే సింహాలు, కుక్కల గురించి మాట్లాడతారు: ఆర్ఎస్ఎస్ పై ఒవైసీ మండిపాటు

ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ.. ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ పై మండిపడ్డారు.

Last Updated : Sep 9, 2018, 10:22 AM IST
రాజ్యాంగాన్ని నమ్మనివారే సింహాలు, కుక్కల గురించి మాట్లాడతారు: ఆర్ఎస్ఎస్ పై ఒవైసీ మండిపాటు

ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ.. ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ పై మండిపడ్డారు. చికాగోలో జరిగిన ప్రపంచ హిందూ కాంగ్రెస్ సభలో భగవత్ ప్రసంగిస్తూ "హిందువులందరూ ఐకమత్యంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించేవారని.. కానీ నేడు ఆ పరిస్థితి లేదని" అన్నారు. "మేము తొలినాళ్లలో కార్యకర్తలను సమాయత్తపరిచేటప్పుడు వారికి ఈ విధంగా చెప్పేవాళ్లం. సింహం ఎప్పుడూ గుంపులో నడవదు.. ఒంటరిగానే పోరాడడానికి ప్రయత్నిస్తుంది. అయితే అది ఎంత గొప్ప సింహమైనా... పులి అయినా ఒంటరిగా వెళ్తే ఏదో ఒక రోజు అడవి కుక్కల చేతిలో చావక తప్పదు.

అందుకే ఏదైనా పోరాటానికి వెళ్లేటప్పుడు కలిసి కట్టుగా వెళ్లాలి. ఐకమత్యంగా పోరాడాలి. హిందువులు ఇది గుర్తుపెట్టుకోవాలి" అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఒవైసీ అభ్యంతరం తెలిపారు. "ఆయన తమవారిని సింహాలుగా, పులులుగా పోల్చుకుంటూ.. మిగతావారిని కుక్కలతో పోల్చారు. గత 90 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ ఇదే భాష మాట్లాడుతుంది. కాబట్టి నేను ఆశ్చర్యపోలేదు. జనాలు ఇలాంటివారి భాషను వ్యతిరేకించాలి" అని తెలిపారు. 

భారత రాజ్యాంగం మానవులను మానవులుగా చూడమని చెప్పింది గానీ.. వారిని సింహాలుగా, కుక్కలుగా చూడమని చెప్పలేదని ఒవైసీ అన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఆ రాజ్యాంగం మీదే నమ్మకం లేని వ్యవస్థలా మారిందని చెబుతూ.. ఒవైసీ, మోహన్ భగవత్ మాట్లాడిన మాటలను ఖండించారు. తమవారిని గొప్పవారిగా పొగుడుతూ.. ఇతరులను చులకన చేసి మాట్లాడడం అనేది ఆర్ఎస్ఎస్‌కి బాగా అలవాటైందని ఆయన అభిప్రాయపడ్డారు. మోహన్ భగవత్ ఎవరిని సింహాలుగా, కుక్కలుగా పేర్కొన్నారో బహిర్గతం చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. 

Trending News