క్యాస్టింగ్ కౌచ్ కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేదు: రేణుకా చౌదరి

క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం చలన చిత్ర పరిశ్రమకే పరిమితం కాదని.. అన్ని రంగాల్లోనూ ఉందని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి తెలిపారు. దీనిని ఓ చేదు వాస్తవంగా పరిగణించవచ్చన్నారు. 

Last Updated : Apr 25, 2018, 12:06 AM IST
క్యాస్టింగ్ కౌచ్ కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేదు: రేణుకా చౌదరి

క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం చలన చిత్ర పరిశ్రమకే పరిమితం కాదని.. అన్ని రంగాల్లోనూ ఉందని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి తెలిపారు. దీనిని ఓ చేదు వాస్తవంగా పరిగణించవచ్చన్నారు. పార్లమెంటుతో పాటు రాజకీయ రంగంలో మహిళలపై వేధింపులు ఉండవన్న ఆలోచన తప్పని ఆమె అన్నారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ మీద ఒక జాతీయ స్థాయి ఉద్యమం రావాల్సి ఉందని రేణుకా చౌదరి పేర్కొన్నారు.

హాలీవుడ్‌లో కూడా గతంలో ఇలాంటి ఉద్యమమే వచ్చిందని.. మీటూ క్యాంపెయిన్ పేరుతో అక్కడ ఉద్యమం లేవదీశారని.. అలాంటి ఉద్యమమే భారతీయ చిత్ర పరిశ్రమలో కూడా రావాల్సి ఉందని రేణుక తెలిపారు. ఇటీవలే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో ఈ కల్చర్ ఉందని తెలిపారు. ఆమె మాటలకు ప్రత్యుత్తరమిస్తూ రేణుక ఈ అభిప్రాయాలను పంచుకున్నారు.

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ "ఈ సంప్రదాయం అనేకనేక సంవత్సరాల నుండి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది. ఇది ఇప్పుడే కొత్తగా వచ్చిందేమీ కాదు. కొందరు మహిళల బలహీనతలను అవకాశాలుగా మలచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే కాదు... ప్రభుత్వ శాఖల్లో కూడా ఈ సంప్రదాయం ఉంది.

అలాంటప్పుడు సినీ పరిశ్రమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. అలాగే అమ్మాయిల విషయం చెప్పుకోవాలంటే.. వారు ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్నది వారి ఇష్టం. వారిలో ప్రతిభ ఉంటే ఇతరుల మాటలు విని మోసపోయే అవకాశం ఉండదు. అందుకే సినీ పరిశ్రమను మాత్రమే తప్పు పట్టవద్దు. మాకు అన్నం పెడుతున్న ఇండస్ట్రీ ఇది" అని సరోజ్ ఖాన్ అన్నారు. ఆమె మాటలకు ప్రత్యుత్తరమిచ్చిన రేణుక మాట్లాడుతూ, రాజకీయ రంగం కూడా క్యాస్టింగ్ కౌచ్‌కి అతీతం కాదని తెలిపారు. 

Trending News