నేటి నుంచి స్వీడన్, బ్రిటన్‌‌లలో ప్రధాని మోదీ పర్యటన

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి స్వీడన్‌, బ్రిటన్‌లలో పర్యటించనున్నారు.

Last Updated : Apr 16, 2018, 11:00 PM IST
నేటి నుంచి  స్వీడన్, బ్రిటన్‌‌లలో ప్రధాని మోదీ పర్యటన

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి స్వీడన్‌, బ్రిటన్‌లలో పర్యటించనున్నారు. ఐదు రోజుల పాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది. రాత్రి స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో నార్డిక్‌ దేశాలుగా పేరుగాంచిన స్వీడన్‌, నార్వే, ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌తో జరిగే సదస్సులో ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నారు. ఏప్రిల్‌ 17న సాయంత్రం మోదీ బ్రిటన్‌‌కు వెళ్లనున్నారు. బుధవారం, గురువారం జరిగే 52 సభ్య దేశాలైన చోగం సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు.

చోగం సదస్సుకు ముందు మోదీతో  ఇంగ్లాండ్‌ ప్రధాని థెరిసా మే సమావేశం కానున్నారు. అలానే రాణి ఎలిజబెత్‌-2 బుధవారం ఇచ్చే విందుకు కూడా మోదీ హాజరుకానున్నారని సమాచారం. థేమ్స్‌ నది ఒడ్డున 2015లో మోదీ ఆవిష్కరించిన 12వ శతాబ్దపు లింగాయత్‌ తత్వవేత్త, సామాజిక సంస్కర్త బసవేశ్వరుడి విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు.

ముఖ్యంగా లండన్‌లోని చారిత్రక హాల్‌ వెస్ట్‌మినిస్టర్‌ నుంచి మోదీ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి మోదీకి వచ్చిన పలు ప్రశ్నలకు ఈ ప్రసంగం ద్వారా సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే 2000 మందిని ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటికే ఎంపిక చేశారు.  కాగా ఇక్కడ 1931లో గాంధీజీ తర్వాత మాట్లాడుతున్న రెండో భారతీయుడిగా మోదీ నిలవనున్నారు.

Trending News