ఆర్ఎస్ఎస్ ఈవెంట్: ప్రతిపక్షాలకు మరింత షాక్ ఇచ్చిన ప్రణబ్ ముఖర్జీ

నాగపూర్‌లో ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు

Last Updated : Jun 8, 2018, 12:49 PM IST
ఆర్ఎస్ఎస్ ఈవెంట్: ప్రతిపక్షాలకు మరింత షాక్ ఇచ్చిన ప్రణబ్ ముఖర్జీ

నాగపూర్‌లోని రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయంలో చేపట్టిన ఓ వేడుకకు హాజరైన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెడ్గెవార్‌ని ఆకాశానికెత్తారు. వేడుకకు హాజరైన సందర్భంగా అక్కడి సందర్శకుల డైరీలో తన అభిప్రాయాన్ని రాసుకొచ్చిన ప్రణబ్.. ''భరత మాత ముద్దు బిడ్డకు నివాళి అర్పించేందుకు తాను ఇవాళ ఇక్కడికి వచ్చాను'' అని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి వెళ్లినందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్న ప్రణబ్.. అక్కడ ఏకంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెడ్గెవార్‌ని భరత మాత ముద్దు బిడ్డగా అభివర్ణించి ప్రతిపక్షాలకు మరింత షాక్ ఇచ్చారు. కెబీ హెడ్గె‌వార్ జన్మస్థలమైన నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన వేడుకకు ప్రణబ్ వెళ్లడాన్ని తప్పుపడుతూ ప్రణబ్ కూతురు షర్మిష్త ముఖర్జీ బుధవారమే ఓ ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రణబ్ ముఖర్జీ ఆ తర్వాత తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆమె అందులో హెచ్చరించారు. 

 

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ సైతం ప్రణబ్ ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని స్వీకరించి అక్కడకు వెళ్లడంపై స్పందిస్తూ.. ''ప్రణబ్ దాదా ఇలా చేస్తారని అనుకోలేదు'' అని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనల మధ్య నాగ్‌పూర్‌లో ప్రణబ్ వెల్లడించిన ఈ అభిప్రాయం మున్ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీయనుందో వేచిచూడాల్సిందే మరి!

Trending News